జనసేన, టీడీపీలు కలిసిన వైనంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ స్పందించారు. గదిలో పిల్లిని కొడితే పులవుతుందని…అదే పులిని కొడితే ఏమవుతుంది? అంటూ పవన్ ను ఉద్దేశించి రఘురామ కామెంట్స్ చేశారు. పవన్ కల్యాణ్ ను అనవసరంగా వైసీపీ కెలికిందని, అందుకే వైసీపీ నేతలు పవన్ తో తిట్లు తిన్నారని ఎద్దేవా చేశారు. వరుసబెట్టి ఆరోపణలు చేస్తుంటే ఎవరికైనా కోపం వస్తుందని… పవన్ కూడా మనిషేనని అన్నారు.
పవన్ 3 పెళ్లిళ్ల వ్యవహారం ఆయన వ్యక్తిగతమని అన్నారు. వైఎస్ఆర్ కుటుంబంలో జరిగిన పెళ్లిళ్లపై వైసీపీ నేతలు ఎందుకు నోరిప్పరని రఘురామ ప్రశ్నించారు. జగన్ ముత్తాత వెంకటరెడ్డి తొలి భార్య బతికుండగానే, విడాకులు ఇవ్వకుండానే మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నారని గుర్తు చేశారు. జగన్ సోదరి వైఎస్ షర్మిల కూడా రెండు పెళిళ్లు చేసుకున్నారని గుర్తు చేశారు. తొలుత మేనమామతో ఆ తర్వాత బ్రదర్ అనిల్ కుమార్ తో షర్మిలకు పెళ్లి అయిందని గుర్తు చేశారు.
షర్మిల రెండు పెళ్లిళ్లు చేసుకున్నారేమిటని ఇప్పటిదాకా ఆమెను ఎవరూ ప్రశ్నించలేదు కదా? అని అన్నారు. విశాఖలో గొడవ నేపథ్యంలో ఉత్తరాంధ్రతో పాటు కోస్తాంధ్రలోనూ పవన్ సినిమా జల్సాలోని గాల్లో తేలినట్టుందే…పాట మార్మోగిపోతోందని అన్నారు. తనను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానని పవన్ అన్నారని, అయినా సరే పవన్ ప్యాకేజీ స్టారే అని వైసీపీ నేతలు ఆయనను మరింతగా రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. జడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న సీఎం బాగానే ఉంటారని, మంత్రులు, ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.