వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు.. తనపై ఏపీ ప్రభుత్వం మోపిన రాజద్రోహం సెక్షన్(సెక్షన్ 124-ఏ) ను ఎత్తేయాలని చేస్తున్న ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేశారు.
ఇప్పటి వరకు ఆయన పార్లమెంటు ఎంపీలకు, అన్ని రాష్ట్రాల(ఏపీ తప్ప) ముఖ్యమంత్రులకు ఆర్ ఆర్ ఆర్ లేఖలు రాసిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఆయన రాజ్యాంగ బాధ్యతలను నిర్వహిస్తున్న అన్ని రాష్ట్రాల(ఏపీ సహా) గవర్నర్లకు లేఖలు రాశారు. సెక్షన్ 124-ఏను ఎత్తివేయాలని.. దీనిపై చర్చించాలని ఆయన గవర్నర్లకు విన్నవించారు.
త్వరలో గవర్నర్ల సదస్సు జరగనున్న నేపథ్యంలో.. సెక్షన్ 124ఏను పూర్తిగా రద్దు చేసే విషయంపై సదస్సులో చర్చించాలని రఘురామ కోరారు. జగన్ ప్రభుత్వ వైఫల్యాలు, సంక్షేమ కార్యక్రమాల్లో లోపాలు ఎత్తి చూపినందుకు తనపై అక్రమ కేసులు పెట్టి వేధించిన విషయాన్ని రఘురామ గవర్నర్ల దృష్టికి తీసుకెళ్లారు.
ప్రజా సమస్యలు ప్రభుత్వానికి అర్థమయ్యేలా చేస్తే… సీఎం జగన్ వ్యక్తిగత కక్ష పెంచుకుని అక్రమ కేసులు బనాయించేలా చేశారని లేఖలో పేర్కొన్నారు.
ఏపీ సీఐడీ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి.. అక్రమంగా తనను అరెస్టు చేసి హైదరాబాద్ నుంచి గుంటూరు తరలించారని తెలిపారు.
అరెస్టు చేసిన రోజే సీఐడీ కార్యాలయంలో అత్యంత క్రూరంగా హింసించారని.. సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ నేతృత్వంలో ఐదుగురు వ్యక్తులు.. లాఠీలు, రబ్బరు బెల్టులతో చిత్రహింసలకు గురి చేశారని లేఖలో ప్రస్తావించారు.
స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా ఒక సిట్టింగ్ ఎంపీపై దేశద్రోహం నేరం మోపడమేగాక.. హింసించడం ఇదే తొలిసారి అని రఘురామ వివరించారు. ఈ విషయాన్ని ఇప్పటికే రాష్ట్రపతి దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.
రాష్ట్రపతి అధ్యక్షతన జరిగే గవర్నర్ల సదస్సులో ఈ అంశాన్ని లేవనెత్తి.. తనకు మద్దతుగా నిలవాలని గవర్నర్లకు, లెఫ్టినెంట్ గవర్నర్లకు రఘురామ విజ్ఞప్తి చేశారు.