నరసాపురం ఎంపీ రఘురామరాజు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వరుసగా జగన్ కి లేఖలు రాసి ఇబ్బంది పెడుతున్న రఘురామరాజు తాజాగా షాక్ ఇచ్చారు.
తన పదవిపై నిర్ణయం తీసుకోవడానికి 48 గంటల డెడ్ లైన్ పెట్టి వైసీపీ నేతల ఇగోపై దెబ్బకొట్టారు రాజు. ఈ మేరకు లేఖ రాస్తూ అందులో షాక్ ల మీద షాక్ లు ఇచ్చారు.
ఇటీవలి పరిణామాల నేపథ్యంలో వైసీపీ వెబ్సైట్ నుంచి ఎంపీ రఘురామకృష్ణరాజు పేరును తాజాగా తొలగించారు. దీనిపై వెంటనే స్పందించిన రఘురామరాజు ఈ విషయంపై నిలదీస్తూ.. సీఎం జగన్కు లేఖ రాశారు.
పార్టీ అధికారిక వెబ్సైట్ ఎంపీల జాబితాలో పేరు తొలగించడాన్ని లేఖలో ప్రస్తావిస్తూ … వైసీపీ వెబ్సైట్లో తన పేరును ఎందుకు తొలగించారని నిలదీశారు. పార్టీ నుంచి బహిష్కరించారా? పొరపాటున తొలగించారా? లేక కావాలనే తొలగించారా? అని స్పష్టత కోరారు.
ఒకవేళ ఉద్దేశపూర్వకంగా తొలగించి ఉంటే 48 గంటల్లో పేరు చేర్చండి. లేకపోతే పార్లమెంట్ సెక్రటేరియట్ దృష్టికి తీసుకెళ్తానని రఘురామ స్పష్టం చేశారు. తద్వారా పార్టీ నుంచి బహిష్కరించినట్లు భావించి ఇండిపెండెంట్ గా ప్రకటించుకుంటానని ఆయన వార్నింగ్ ఇచ్చారు.
మొత్తానికి రఘురామరాజు రాజ్యాంగం, చట్టంలోని వెసులుబాట్లను చక్కగా సద్వినియోగం చేసుకుని వైసీపీ అధినేతకు నిద్ర లేకుండా చేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.