టిడిపి అధినేత ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు, ఏపీ సీఎం జగన్ కూడా హస్తినలో పర్యటిస్తున్నారు. దాదాపు 40 పార్టీల అధినేతలు హాజరుకానున్న జీ-20 సన్నాహక సమావేశంలో పాల్గొనేందుకు చంద్రబాబుతో పాటు జగన్ కు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి భవన్ లో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈరోజు సాయంత్రం జరగబోయే ఈ సమావేశంలో పాల్గొనేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలిద్దరూ హస్తినలో పర్యటిస్తున్నారు.
ఈ క్రమంలోనే టిడిపి ఎంపీ, టీడీపీ లోక్ సభాపక్ష నేత గల్లా జయదేవ్ ల నివాసంలో చంద్రబాబు అధ్యక్షతన టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. కొద్ది రోజుల్లోనే పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఉభయ సభల్లో ప్రస్తావించాల్సిన అంశాల గురించి ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. వైసిపి ప్రభుత్వ పాలనను పార్లమెంటు సాక్షిగా ఎండగట్టాల్సిన వైనంపై చంద్రబాబు ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై టిడిపి ఎంపీలకు చంద్రబాబు దిశా నిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది.
మరోవైపు, టిడిపి అధినేత చంద్రబాబుతో వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఢిల్లీలో భేటీ అయ్యారు. పార్లమెంటు సమావేశాల చివరి రోజున ఎంపీలు రాజీనామా చేసి విభజన హామీల కోసం కేంద్రంపై ఒత్తిడి చేద్దామని గతంలో జగన్ అన్నారని ఆయన గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కోసం రాజీనామాకు తాను సిద్ధమని రఘురామ ప్రకటించారు. టిడిపి ఎంపీలతో కూడా రాజీనామా చేయించేందుకు చంద్రబాబును ఒప్పించడానికి ఆయనతో భేటీ అయ్యానని రఘురామ వెల్లడించారు.