కొంతకాలంగా సీఎం జగన్ కు, వైసీపీ నేతలకు ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కొరకరాని కొయ్యగా మారిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ ను రాజకీయంగా ఎదుర్కోవడంలో విఫలమైన వైసీపీ నేతలు తాజాగా తాటాకు చప్పుళ్లు చేయడం మొదలుపెట్టారు. పవిత్రమైన పార్లమెంటు సాక్షిగా సాటి ఎంపీలందరూ చూస్తుండగానే రఘురామను లేపేస్తానంటూ వైసీపీ నేత, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వార్నింగ్ ఇవ్వడం కలకలం రేపింది. జగన్ కు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెడితే లేపేస్తానంటూ రఘురామను మాధవ్ బెదిరించడం సంచలనంగా మారింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ వ్యవహారంపై రఘురామ స్పందించారు. ప్రెస్ మీట్ పెడితే లేపేస్తానన్నారని, ఇపుడు ప్రెస్ మీట్ పెట్టే మాట్లాడుతున్నానని వైసీపీ నేతలకు, మాధవ్ కు రఘురామ సవాల్ విసిరారు. ఈ పిచ్చి ఉడుత ఊపులకు తాను భయపడనని, తాను చేస్తున్నది ధర్మ పోరాటమని అన్నారు. ఏపీ నుంచి అమర రాజా కంపెనీ తరలిపోవడంపై సజ్జల ఓ మాట, బొత్స మరో మాట మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
అమరరాజాకు వైఎస్ఆర్ అదనపు భూకేటయింపులు చేశారని, నాడు లేని తప్పులు నేడు ఎలా కనపడ్డాయని ప్రశ్నించారు. అన్ని శాఖల గురించి సజ్జలే మాట్లాడతారా అని ప్రశ్నించారు. సజ్జల విశృంఖలత్వంగా వ్యవరిస్తున్నారని, తన అంతు చూస్తానన్నగోరంట్ల మాధవ్ ను ఆయన అభినందించారని మండిపడ్డారు. విశాఖ ఉక్కుపై టీడీపీ ఎంపీలు రాజీనామా చేస్తామనడాన్ని స్వాగతిస్తున్నానని, ఆ విషయంపై తాను కూడా రాజీనామాకు రెడీ అని చాలెంజ్ చేశారు.
వైసీపీ ఎంపీలందరం కలిసి రాజీనామాలు చేద్దామని, సీఎం జగన్ కూడా ఢిల్లీ వచ్చి విశాఖ ఉక్కు కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏపీ సర్కార్ అప్పులు చేస్తోందని కేంద్రానికి ఫిర్యాదు చేశానని, అందుకుగాను ఆర్థిక శాఖ అధికారులను సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక అవకతవకలపై చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీకి లేఖ రాశానని వెల్లడించారు.