ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారంపై వాడీవేడీ చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ పై హీరో నాని చేసిన వ్యాఖ్యలకు పలువురు టీడీపీ నేతలు మద్దతిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తనదైన శైలిలో స్పందించారు. టికెట్ల విషయంలో సినిమా పరిశ్రమను ఇబ్బంది పెట్టొద్దని ఆర్ఆర్ఆర్ హితవు పలికారు. టీటీడీలో తిరుమల దర్శనం టికెట్లు అమ్మలేక వైవీ సుబ్బారెడ్డి రిలయన్స్ కు అప్పజెప్పారని గుర్తు చేశారు.
రామతీర్థంలో అశోక్ గజపతికి జరిగిన అవమానంపై కూడా ఆర్ఆర్ఆర్ స్పందించారు. ఘన చరిత్ర కలిగిన పూసపాటి అశోక్ గజపతి రాజును అవమానించడం తగదని అన్నారు. అది యావత్ హిందువులకు జరిగిన అవమానమని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాలయాలకు తాము ఎంతో చేస్తున్నామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, సీఎం జగన్ అంటున్నారని, కానీ, దేవాలయాలకు, చర్చిలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకూడదని గుర్తు చేశారు.
ఆ విషయం మంత్రులు, జగన్, వైసీపీ నేతలు తెలుసుకోవాలని హితవు పలికారు. అంతగా ఇవ్వాలనుకుంటే భారతి సిమెంట్స్ నుంచి నిధులు తెచ్చుకోవాలని, ఎవరు వద్దన్నారని రఘురామ చురకలంటించారు. అయినా, ఏపీలో జగనన్న రహస్య పాలన ఎందుకో తనకు అర్ధం కావడం లేదని రఘురామ ప్రశ్నించారు. ఏపీలో గడిచిన రెండేళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని కేంద్రమంత్రి పార్లమెంట్లోనే జగన్ గుట్టురట్టు చేశారని అన్నారు. రాష్ట్రంలో నిర్మాణం పూర్తైన ఇళ్లను కూడా ఎవరికి ఇవ్వడం లేదని మండిపడ్డారు.