చాలా కాలంగా సీఎం జగన్ పై విమర్శలు గుప్పిస్తోన్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వైసీపీకి రాజీనామా చేసి గెలుస్తానని, ఒకవేళ తాను గెలిస్తే జగన్ రాజీనామా చేయాలని షాకింగ్ కామెంట్లు చేశారు. అంతేకాదు, తనను డిస్ క్వాలిఫై చేయడానికి జగన్ కు రఘురామ డెడ్లైన్ పెట్టారు. ఫిబ్రవరి 5వ తేదీలోపు తనను ఎంపీ పదవి నుంచి జగన్ డిస్ క్వాలిఫై చేయించలేకపోతే జగన్ దమ్ములేని ముఖ్యమంత్రి అని ఒప్పుకోవాలని ఛాలెంజ్ చేశారు.
తన డిస్ క్వాలిఫై అంశం గురించి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాల్లో ఎవరికైనా ఫిర్యాదు చేసుకోవచ్చంటూ జగన్ కు బంపర్ఆఫర్ ఇచ్చారు ఆర్ఆర్ఆర్. తనను డిస్ క్వాలిఫై చేయిస్తే రాజీనామా చేసి నర్సాపురం ఎంపీగా ఉప ఎన్నికలో పోటీచేసి బంపర్ మెజారిటీతో గెలుస్తానని సవాల్ విసిరారు. ఒకవేళ తాను ఓడిపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని, తాను గెలిస్తే జగన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అంతేకాదు, జనవరి 13న నర్సాపురం వెళ్తున్నానని, 2 రోజులు అక్కడే ఉంటానని, ఆ 2 రోజులు ఏపీ పోలీసులే తనకు భద్రత కల్పించాలని రఘురామ కోరారు. ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించడం కోసం తన ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. మరి, రఘురామ తాజా కామెంట్లపై వైసీపీ నేతలు, జగన్ స్పందన ఏవిధంగా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.