వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు నరసరావురం ఎంపీ టికెట్ ఆశించిన సంగతి తెలిసిందే. అయితే, టిడిపి, బిజెపి, జనసేన కూటమి పొత్తులో భాగంగా నరసాపురం లోక్ సభ స్థానం శ్రీనివాస వర్మకు దక్కింది. ఈ నేపథ్యంలోనే ఉండి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా రఘురామ బరిలోకి దిగుతారని ప్రచారం జరిగింది. కానీ, ఆ విషయంపై అధికారికంగా ప్రకటన వెలువడలేదు. దీంతో, ఆ వ్యవహారం పై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఉండితోపాటు మరో మూడు స్థానాల్లో అభ్యర్థులను మార్చేందుకు టిడిపి అధినేత చంద్రబాబు సిద్ధమయ్యారని తెలుస్తోంది.
ఉండి టికెట్ ను రఘురామకు కేటాయించాలని చంద్రబాబు ఫిక్సయ్యారని తెలుస్తోంది. అంతేకాదు, ఈ నెల 22వ తేదీన రఘురామ నామినేషన్ వేయబోతున్నారని తెలుస్తోంది. ఉండి అభ్యర్థిగా ప్రకటించిన మంతెన రామరాజును పశ్చిమగోదావరి జిల్లా టిడిపి అధ్యక్షుడిగా నియమించాలని చంద్రబాబు అనుకుంటున్నారట. దీంతోపాటు అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గ అభ్యర్థి పైల ప్రసాద్ ను కూడా చంద్రబాబు మార్చబోతున్నారట. సర్వేలో ఆయన వెనుకబడ్డారని తెలియడంతో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి ఆ టికెట్ కేటాయించాలని చంద్రబాబు అనుకుంటున్నారని తెలుస్తోంది.
మడకశిర అభ్యర్థి అనిల్ కుమార్ ను కూడా మార్చబోతున్నారని తెలుస్తోంది. ఆ స్థానంలో దళిత విభాగ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెస్ రాజును మడకశిర బరిలో దింపాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. దాంతోపాటు అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె అభ్యర్థిని కూడా టిడిపి మార్చబోతుందట. అయితే, ఈ వ్యవహారంపై ఈ రోజో రేపో అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.