గత ఏడాది భారీ అంచనాల మధ్య వచ్చిన విజయ్ దేవరకొండ సినిమా డియర్ కామ్రేడ్.. ఆ అంచనాల్ని అందుకోలేక డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ ఫలితం సంగతలా వదిలేస్తే.. దాని సంగీతం మాత్రం గొప్ప ప్రశంసలందుకుంది. అందులో ప్రతి పాటా ఓ ఆణిముత్యమే.
కడలల్లె.. గిర గిర.. ఎటు పోనే.. ఈ పాటలు సంగీత ప్రియుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. చార్ట్ బస్టర్లయ్యాయి. నేపథ్య సంగీతం కూడా ఆ చిత్రానికి పెద్ద ఎస్సెట్ అయింది. ఈ సినిమాతో తెలుగులోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు తమిళ సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్. ఆ సినిమా ఆడి ఉంటే అతడికి ఇంకా మంచి పేరొచ్చేది. అవకాశాలూ దక్కేవి. డియర్ కామ్రేడ్ ఫట్ అవడంతో ఏడాది పాటు మళ్లీ తెలుగులో కనిపించలేదు జస్టిన్.
ఐతే ఇప్పుడు ఓ భారీ చిత్రంతో జస్టిన్ తన సత్తా చాటడానికి సిద్ధమయ్యాడు. ఆ సినిమా ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ కావడం విశేషం. ప్రభాస్ చివరి సినిమా సాహో మాదిరే ఈ చిత్రానికి కూడా సంగీత దర్శకుడిని ఖరారు చేయడంలో చాలా ఆలస్యమైంది. ఐతే సాహో లాగా దీనికి ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్‌తో ఒక్కో పాట చేయిస్తే వర్కవుట్ కాదు. ఎందుకంటే ఇది ప్రేమకథ. ఇందులో సంగీత పరంగా చాలా ప్రాధాన్యం ఉంటుంది. పాటలు, నేపథ్య సంగీతంలో ఒక ఫీల్ ఉండాలి. అది సినిమా అంతటా కొనసాగాలి. అందుకే డియర్ కామ్రేడ్‌తో మైమరిపించిన జస్టిన్‌కు అవకాశమిచ్చారు దర్శకుడు రాధాకృష్ణకుమార్, నిర్మాతలు వంశీ, ప్రమోద్. ఈ న్యూస్ బయటికి రాగానే అందరిలోనూ హర్షం వ్యక్తమవుతోంది. సరైన వ్యక్తికే బాధ్యతలు అప్పగించారని ప్రశంసిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా రిలీజయ్యే అవకాశముంది. కాబట్టి జస్టిన్‌కు బాగానే సమయం దొరకబోతున్నట్లే.