‘సుబ్రమణ్యంస్వామిని చూస్తే రాజకీయనేతలు, ముఖ్యంగా అవినీతిపరులు భయపడతారేమో కానీ ఆంధ్రజ్యోతికి ఆ అవసరం లేదు’…
‘తమపై స్వామి చేసిన నిరాధార ఆరోపణలకు తాము కూడా సుబ్రమణ్యస్వామిపై పరువునష్టం దావా కేసులు వేస్తాం’… ఇది తాజాగా ఆంధ్రజ్యోతి యాజమాన్యం వివాదాస్పద ఎంపి సుబ్రమణ్యంస్వామి పై తాజాగా చేసిన కామెంట్లు. నాలుగు రోజుల క్రితం తిరుమల తిరుపతి దేవస్ధానం విషయంలో అప్పుడెప్పుడో ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ఓ వార్తపై స్వామి ఇపుడు పరువునష్టం దావా కేసు వేశారు. దానిపైనే సదరు పత్రిక ఎండి రాధాకృష్ణ సుబ్రమణ్య స్వామి అసలు రంగు బయటపెట్టారు.
సుబ్రమణ్య స్వామిపై వరుసగా నాలుగు రోజులుగా కథనాలు అందిస్తున్నారు. అంటే ఆంధ్రజ్యోతి యాజమాన్యాన్ని స్వామి ఏ స్ధాయిలో కెలికేశారో అర్ధమైపోతోంది. ప్రత్యర్ధి నిజంగానే చెప్పుకోదగ్గ వ్యక్తి కాకపోతే మనం అసలు పట్టించుకోము. కానీ ప్రత్యర్ధి గట్టి వాడైనపుడు మాత్రమే మనం పదే పదే మాట్లాడుతుంటాం.
చాలామందికి తెలియని ఒక విషయాన్ని రాధాకృష్ణ బయటపెట్టాడు. సుబ్రమణ్య స్వామి సుప్రీంకోర్టు న్యాయవాది అని సాక్షి ఒక అబద్ధాన్ని అల్లింది. అయితే, అతను న్యాయవాది కాదు, కనీసం లా కూడా చదవలేదు. ఈ విషయాన్ని రాధాకృష్ణ బయటపెట్టి స్వామిది, సాక్షిది పరువు తీశారు.
అసలు న్యాయవాదే కాదని, ఏ అర్హతతో కేసు వేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తమపై దావా వేయటానికి స్వామి కనీసం న్యాయవాది కూడా కాదన్నారు. అయితే న్యాయవాది కేసు వేయాలి. లేదంటే టీటీడీ వాళ్లు కేసు వెయ్యాలి. ఈ రెండింటికి సంబంధం లేని సుబ్రమణ్య స్వామి వేరే కేసు వేయొచ్చు గాని పరువు నష్టం కేసు వేయడమే విచిత్రం.
నిజానికి టీటీడీతో ఏ సంబంధం లేని సుబ్రమణ్యం పరువు నష్టం కేసు వేస్తే అది ఎంతవరకు నిలబడుతుందన్నదే ఇక్కడ ప్రశ్న.
సరే ఇక ప్రస్తుతానికి వస్తే స్వామిపై తాము కూడా పరువునష్టం దావా వేస్తామని చెప్పారు. నిరాధారంగా తమకు చంద్రబాబునాయుడుకు ముడిపెట్టి వార్తలు రాసే వాళ్ళను కూడా విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు. అంటే స్వామి కారణంగా ఇకపై రాధాకృష్ణపై దుష్ప్రచారం చేసే వెబ్ సైట్లు కూడా బుక్కయినట్లే అన్నమాట.