సాంకేతిక పెరిగిన తర్వాత చాలా విషయాలు బయటకు వచ్చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో సంచలనాలు చోటు చేసుకోవటమే కాదు.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి బయటకు వచ్చింది. రోటీన్ కు భిన్నంగా ఈ ఎపిసోడ్ లో ట్విస్టు ఏమంటే.. అధికారిని బూతులు తిట్టిన ఎమ్మెల్యే తీరు కోపం కలిగించినా.. విషయం మొత్తం తెలిసినప్పుడు మాత్రం.. ఆయన కోపానికి కన్వీన్స్ కావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..
హైదరాబాద్ మహానగర శివారు ఎమ్మెల్యేల్లో ఒకరు కుత్భుల్లాపూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేపీ వివేకానంద్. ఉన్నత విద్యావంతుడిగా.. సౌమ్యుడిగా పేరున్న ఆయన ఇమేజ్ ను తాజాగా బయటకు వచ్చిన ఆడియో క్లిప్ మార్చేసింది. వీఆర్వోను బండబూతులు తిట్టేసిన ఆడియో క్లిప్ ఇప్పుడు వైరల్ గా మారింది. రాయలేని పదాల్ని ఆయన వాడేశారు. మీడియాలోనూ ఆయన వాడిన పదజాలాన్ని యథాతధంగా ఎవరూ రాయలేదు. ఒకవేళ రాద్దామనుకున్నా సాధ్యం కాదు. అంత ఘాటుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి మరి.
ఇంతకూ ఎమ్మెల్యే సాబ్ కు అంత కోపం ఎందుకు వచ్చిందంటే.. అందులోని సముచితమైన కారణం ఉందన్న మాట వినిపిస్తోంది. అదేమంటే.. ఆయన నియోజకవర్గంలోని గాజులరామారంలోని ప్రభుత్వ స్థలాల్ని కబ్జా చేసిన అధికార పార్టీకి చెందిన నేత ఒకరు పేదలకు తక్కువ ధరకు ఆశ చూపించి చిన్న చిన్న ప్లాట్లు చేసి అమ్మేస్తుంటారు. వంద గజాల లోపు ఉన్న ఈ జాగాల్ని రూ.15 లక్షల వరకు కొంటారని సమాచారం.
ప్రభుత్వ స్థలాల్ని అలా ఎలా అమ్ముతారంటే.. అదే చిదంబర రహస్యం. నాయకులు అమ్మే ఈ స్థలాల్ని తక్కువ ధరకు వస్తున్నాయన్న కక్కుర్తితో కొనేస్తారు. అలా కొనేసి.. అందులో ఇళ్లు కట్టుకొని నివసిస్తున్న వారిపై రెవెన్యూ సిబ్బంది ఉన్నట్లుండి కన్నెర్ర చేశారు. తెల్లవారుజామున ఐదారు గంటల మధ్యలో జేసీబీలను తీసుకొచ్చి.. ఇళ్లను హటాత్తుగా కూలగొట్టేయటంతో వారంతా అవాక్కు అయ్యారు. కాయ కష్టం చేసి ఇల్లు నిర్మించుకొని అందులో ఉంటే.. నోటీసులు ఏమీ లేకుండా తెల్లవారుజాము ప్రాంతంలో వచ్చి కూలగొట్టేయటం.. కరెంటు మీటర్లను స్వాధీనం చేసుకొని వెళ్లటం వివాదంగా మారింది.
ఈ తీరులో దాదాపు పదహారు ఇళ్లను నేలమట్టం చేశారు. దీంతో.. తమ గూడు పోయిన ఆవేదనతో పొద్దున్నే ఎమ్మెల్యే నివాసానికి సదరు కాలనీ వారు పోటెత్తారు. అందులొ ఒక గర్భిణితో పాటు.. పలువురు మహిళలు ఉండటం.. వారి రోదనలతో భావోద్వేగానికి గురైన ఎమ్మెల్యే వివేకానంద్.. ఫోన్లో చెలరేగిపోయారు. అధికారిని బండబూతులు తిట్టారు. అక్రమ నిర్మాణం అయితే.. ఇల్లు కడుతున్నప్పుడు ఏం చేస్తున్నారు? అప్పుడు కదా ఆపాల్సింది. అప్పుడు ఊరుకొని.. ఇల్లు కట్టుకొని కాపురం చేసే సమయంలో కూలగొడితే వారేం చేయాలి? అని ప్రశ్నించగా.. తమ పై అధికారులు చెప్పటంతో తాము ఆ పని చేసినట్లుగా తమ చర్యను సదరు అధికారి సమర్థించుకున్నారు.
దీంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వివేకా.. ఓపక్క ప్రభుత్వం పేదల ఇళ్లను రెగ్యులరైజ్ చేయాలని చూస్తుంటే.. మీ రెవెన్యూ వాళ్లు బుద్ధి మార్చుకోవటం లేదంటూ నిప్పులు చెరిగారు. ‘పేదల పొట్ట కొడుతున్నారు. పాపం చుట్టుకుంటుంది’ అంటూ ఎమ్మెల్యే వివేక మాటలు విన్నప్పుడు.. రెవెన్యూ అధికారిని బూతులు తిట్టటం తప్పైనప్పటికీ.. నిస్సహాయులైన పేదలకు కష్టం కలిగించిన అధికారిని తిట్టటం సరైన చర్యగా అనిపించక మానదు.
అదే సమయంలో ఇళ్లు కూలగొట్టిన అధికారిపై అవినీతి ఆరోపణలు ఉండటాన్ని ఎమ్మెల్యే ప్రస్తావిస్తూ.. మీకు డబ్బులు ఇస్తే సరే.. లేకపోతే ఇళ్లు కూలగొడతారా? అంటూ తిట్టటం గమనార్హం. మిగిలిన మాటలకు సమాధానం ఇచ్చిన సదరు అధికారి.. అవినీతి ఆరోపణలు చేసినప్పుడు మాత్రం కామ్ గా ఉండటాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు.