పీవీ రమేశ్ ఆదివారం చేసిన ట్వీట్ కాస్త ఆలస్యంగా వెలుగు చూడటమే కాదు.. పెద్ద ఎత్తున రాజకీయ చర్చకు తెర తీసింది. అధికార.. ప్రభుత్వ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన ఈ ట్వీట్ లో ఏమున్నదంటే..
‘‘నేరమే అధికారమై ప్రజలను నేరస్థులను చేసి వెంటాడుతుంటే.. ఊరక కూర్చున్న నోరున్న ప్రతివాడూ నేరస్థుడే’ అంటూ విప్లవ కవి వరవరరావు మాటల్ని ఉటంకిస్తూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒకప్పటి సలహాదారు పీవీ రమేశ్ చేసిన పోస్టు సంచలనంగా మారింది.
జగన్ ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిగిన ఆయన.. గత ఏడాది చివర్లో తన ప్రభుత్వ సలహాదారుపదవితో పాటు అదనపు ప్రధాన కార్యదర్శి హోదాకు రాజీనామా చేసి.. అన్నింటికి దూరంగా ఉంటున్నారు. ఇలాంటి వేళ.. తన ట్వీట్ తో ఒక్కసారిగా చర్చలోకి రావటమే కాదు.. ఆయన ట్వీట్ పై పెను దుమారంగా మారింది. దీనికి ఒక్కొక్కరు ఒక్కో భాష్యం చెబుతూ.. ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసిన ట్వీట్ గా తీర్పులు ఇచ్చేశారు. ఎక్కువమంది ఈ ట్వీట్ సీఎం జగన్ ను ఉద్దేశించిందేనని తేల్చేశారు.
ఇదిలా ఉంటే.. ఆదివారం సాయంత్రానికి జగన్ మనుషుల నుంచి బెదిరింపులు వచ్చాయో, లేక ఎవరైనా సలహా ఇస్తే చల్లబడ్డారో… లేక ఇంకేం జరిగిందో తెలియదు గాని మరో ట్వీట్ తో సంచలనాన్ని చల్లబరిచే యత్నం చేశారు పీవీ రమేష్.
తాను చేసిన ట్వీట్ వరవరావు కొటేషన్ అని.. దానికి ప్రభుత్వానికి.. వ్యక్తులకూ సంబంధం లేనిదని తేల్చేశారు. ఒక కవితలో భాగమన్న ఆయన.. ఉదయం ట్వీట్ తో పుట్టించిన వేడిని తగ్గించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తన తాజా ట్వీట్ లో సర్దుబాటు స్పష్టంగా కనిపించింది.
అందులో ఏమున్నందంటే.. ‘విశ్వజనీయమైన.. కాలాతీతమైన సత్యాలను వ్యక్తిగతంగా అపాదించేందుకు ప్రయత్నిస్తే.. మీ ఆలోచనా శక్తి అంతవరకే పరిమితమైనదిగా భావించాల్సి వస్తుంది’ అని స్పష్టం చేశారు. ఇదంతా చూశాక.. ఉదయం వేడి పుట్టే ట్వీట్ పెట్టి.. సాయంత్రానికి చల్లార్చే ప్రయత్నం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? అన్న సందేహం కలుగక మానదు.