ఇన్ని రోజులూ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్టు.. కస్టడీలో ఆయనపై పోలీసుల ప్రతాపం.. ఒంటిపై గాయాలకు సంబంధించిన వైద్య నివేదికలు.. కోర్టు విచారణ. బెయిల్ మంజూరు లాంటి అంశాలే చర్చనీయాంశంగా ఉన్నాయి.
ఐతే బెయిల్ మీద బయటికి వచ్చాక రఘురామ తనను ఇబ్బంది పెట్టిన వాళ్లందరినీ టార్గెట్ చేస్తూ తనేంటో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. తన అరెస్టుపై తోటి ఎంపీలందరికీ ఆయన లేఖ రాయడం తెలిసిందే.
మరోవైపు తన పట్ల కక్ష పూరితంగా వ్యవహరించిన ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ సునీల్ కుమార్‌ను ఆయన లక్ష్యంగా చేసుకున్న సంగతి తెలిసిందే. కస్టడీ టైంలో తన మొబైల్ ఫోన్‌ను సునీల్ కుమార్ బలవంతంగా లాక్కున్నారని, తనను హింసించి మరీ పాస్వర్డ్ తెలుసుకుని మొబైల్ అన్‌లాక్ చేశారని రఘురామ ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. రఘురామ మొబైల్ గొడవలోకి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ రావడం గమనార్హం. రఘురామ నంబర్ నుంచి తనకు, తన కుటుంబ సభ్యులకు వాట్సాప్ సందేశాలు వస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. ఈ విషయమై రఘురామ స్పష్టత ఇవ్వాలంటూ ఆయన మొబైల్ నంబర్‌ను సైతం ట్విట్టర్లో షేర్ చేశారు రమేష్.
దీనిపై రఘురామ వెంటనే స్పందించారు. ‘‘నన్ను అరెస్టు చేసిన మే 14నే నా ఫోన్‌ను సీఐడీ పోలీసులు అక్రమంగా స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి ఫోన్ వారి దగ్గరే ఉంది. నాలుగు రోజుల కిందట నా సిమ్ బ్లాక్ చేసి కొత్తది తీసుకున్నాను. ఫోన్ తిరిగివ్వాల్సిందిగా శుక్రవారం సీఐడీకీ లీగల్ నోటీసులు కూడా ఇచ్చాను.
మే 14 నుంచి జూన్ 1 వరకు నేను ఎవరికీ మెసేజ్‌లు కూడా పంపలేదు. ఒకవేళ నా ఫోన్‌ను అక్రమంగా ఉపయోగించి ఉంటే సునీల్ కుమార్, ఇతరులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా’’ అని రఘురామ పేర్కొన్నారు.
కాగా పీవీ రమేష్‌కు, సునీల్ కుమార్‌కు ఉన్న కుటుంబ గొడవలు ఇక్కడ ప్రస్తావనార్హం. సునీల్ సతీమణి.. రమేష్ సొంత సోదరి కావడం గమనార్హం. తనపై సునీల్ గృహహింసకు పాల్పడినట్లు ఆమె గతంలో పోలీసులను ఆశ్రయించారు. ఈ గొడవ కొన్నేళ్లుగా నడుస్తోంది.
ఐతే సునీల్ కుమార్ విషయంలో రఘురామను రమేష్ సోదరి సాయం కోరినట్లు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్‌ను టార్గెట్ చేస్తున్న రఘురామను అరెస్టు చేయడానికి సునీల్ అత్యుత్సాహం చూపించారని.. రఘురామతో రమేష్ సోదరి టచ్‌లో ఉందేమో తెలుసుకునేందుకు ఆయన ఫోన్ నుంచి మెసేజ్‌లు పంపి ఉండొచ్చని అనుమానాలు రేకెత్తుతున్నాయి.
From 14th May till 1st June I have not sent any messages to anyone. I assure you that appropriate legal action would be initiated against sunil kumar and others if they misused in violation of rules.
— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) June 5, 2021