ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగటానికి పశ్చిమ దేశాలే కారణమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమర్ధించుకున్నారు. ఉక్రెయిన్ భూభాగాన్ని అడ్డంపెట్టుకుని రష్యాకు వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగించాలన్న పశ్చిమదేశాల ఆలోచనలు తమకు తెలిసినట్లు పుతిన్ చెప్పారు. పాశ్చాత్య దేశాల దాడుల నుండి తమ దేశాన్ని రక్షించుకోవాలంటే ముందు ఉక్రెయిన్ పై యుద్ధం చేయక తప్పని పరిస్ధితులను పాశ్చాత్య దేశాలు కల్పించినట్లు పుతిన్ మండిపడ్డారు.
రష్యాలో జరిగిన విక్టరీ డే సందర్భంగా మాట్లాడుతూ యుద్ధం చేయటం తమకు ఏమాత్రం ఇష్టం లేదన్నారు. పరిస్ధితులను యుద్ధం చేసేదాక తీసుకు రాకూడదన్న తమ ప్రయత్నాలను ఉక్రెయిన్ పట్టించుకోలేదన్నారు. పాశ్చాత్య దేశాల దన్నుచూసుకునే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తమ ప్రయత్నాలు, హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోలేదని అధినేత మండిపోయారు. దాంతో చేసేది లేక చివరి ప్రయత్నంగా యుద్ధానికి దిగాల్సొచ్చిందని పుతిన్ సమర్ధించుకున్నారు.
సైనిక చర్యను పూర్తిస్ధాయి యుద్ధంగా మార్చబోతున్నారన్న అనుమానాలు అనుమానాలుగానే ఉండిపోయాయి. సైనిక చర్యను పుతిన్ పూర్తిస్ధాయి యుద్ధం గా మార్చే విషయమై విక్టరీ డే సందర్భంగా ప్రకటిస్తారని ప్రపంచ దేశాలు టెన్షన్ పడ్డాయి. అయితే పుతిన్ మాత్రం అలాంటి ప్రకటనేదీ చేయలేదు. ఇదే సమయంలో సైనిక చర్య (యుద్ధం) ఎంతకాలం కంటిన్యు అవుతుందనే విషయాన్ని కూడా ప్రకటించలేదు. దాంతో అందరిలోను అయోమయం కంటిన్యూ అవుతోంది.
ఉక్రెయిన్ పై సైనిక చర్య తప్పనిసరైనదిగా పుతిన్ అభివర్ణించారు. పాశ్చాత్యదేశాల కారణంగానే సైన్యాన్ని దించాల్సొచ్చిందని పుతిన్ ఆరోపించారు. రష్యా భద్రతకు ముప్పు పెరుగుతున్న విషయాన్ని తాము గ్రహించామన్నారు. ఉక్రెయిన్ ను అడ్డుపెట్టుకుని తమ దేశంలోకి అడుగుపెట్టాలని పాశ్చాత్య దేశాల కుట్రలను అడ్డుకునేందుకే సైనిక చర్యకు దిగాల్సొచ్చిందని చెప్పారు. రష్యా భూభాగంలోకి నాటో దేశాల విస్తరణ ఎట్టి పరిస్ధితుల్లోను అనుమతించేది లేదంటు పుతిన్ తెగేసి చెప్పారు. ఇదే సమయంలో ఉక్రెయిన్ పై దాడులను మరింత ఉధృతం చేయాలని మాత్రం పుతిన్ నిర్ణయించినట్లు సమాచారం. ఆ దాడులు ఏ రూపంలో ఉంటాయనే విషయం ప్రస్తుతానికైతే సస్పెన్సుగానే ఉండిపోయింది.