అల్లు అర్జున్, సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ కలిస్తే సినిమా ఎలా ఉంటుందో ‘ఆర్య’ ఫ్రాంచైజీ ప్రూవ్ చేసింది. ఇప్పుడు మరోసారి ఈ ముగ్గురూ కలిసి ‘పుష్ప’తో మ్యాజిక్ చేయడానికి రాబోతున్నారు. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలవుతున్న ఒక్కొక్క పాటనీ చూస్తుంటే ఈసారి కూడా అదిరిపోయే మ్యూజికల్ ఫీస్ట్‌ని రెడీ చేశారని అర్థమవుతోంది.
ఈ సినిమా నుంచి మొదట ‘దాక్కో దాక్కో మేక’ సాంగ్ రిలీజై యూట్యూబ్‌లో రికార్డులు సృష్టించింది. రీసెంట్గా దసరాకి ‘శ్రీవల్లి’ పాట విడుదలై విందు చేసింది. త్వరలో ‘సామీ సామీ’ అనే సాంగ్ రాబోతోంది. ఈ పాట ప్రోమోను ఇవాళ విడుదల చేశారు. గత రెండు పాటల్లాగే ఈ పాట కూడా చాలా స్పెషల్‌గా ఉంది.
‘నువ్వు అమ్మీ అమ్మీ అంటాంటే నీ పెళ్లాన్నైపోయినట్లున్నాదిరా సామీ.. నా సామీ.. సామీ సామీ అంటాంటే నా పెనిమిటి లెక్క సక్కంగుందిరా సామీ.. నా సామీ’ అంటూ సాగిన ఈ పాట కాస్త డిఫరెంట్‌గా ఫోక్ టచ్‌తో ఉంది. చంద్రబోస్ లిరిక్స్‌తో పాటు మౌనిక యాదవ్ పాడిన విధానం కూడా ఆకట్టుకుంది. గత పాటలో శ్రీవల్లిని తలచుకుని పుష్పరాజ్ పరవశిస్తే.. ఈ పాటలో అతనిని తలచుకుని శ్రీవల్లి మురిసిపోతోంది. మొత్తానికి ప్రతి పాట సినిమాపై అంచనాలను పెంచుతోంది. 28న పూర్తి పాట బైటికొస్తుంది.
రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్‌ని ‘పుష్ప: ది రైజ్’ పేరుతో డిసెంబర్ 17న రిలీజ్ చేయబోతున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మిగిలిన కాస్త వర్క్‌ని వీలైనంత వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ విన్నర్ రసూల్ పూకుట్టి సౌండ్ డిజైనింగ్ చేస్తున్నారు.