ఏపీలో ప్రభుత్వాన్ని జగన్ అప్పులతో నడిపిస్తున్నారని ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. సంక్షేమ పథకాలకు పప్పు, బెల్లం లాగా డబ్బులు పంచేందుకు జగన్ అందిన కాడికి అప్పులు చేస్తున్నారని ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీ అప్పలు..వాటికోసం జగన్ పడుతున్న తిప్పలపై కేంద్రంతో పాటు కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) కూడా గతంలో ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ క్రమంలోనే ఏపీ అప్పులపై ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఏపీ అప్పులపై పార్లమెంట్ లో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ అడిగిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఏపీ అప్పు 4 లక్షల కోట్లకు చేరుకుందని నిర్మల సీతారామన్ చెప్పారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ఏపీ బీజేపీ అధ్యక్షరాలు దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని జగన్ ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు.
ఏపీ అప్పులపై నిర్మలా సీతారామన్ చెప్పినవి ఆర్బిఐ గణాంకాలు మాత్రమేనని, వాస్తవానికి ఏపీ అప్పు దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల వరకు ఉంటుందని పురందేశ్వరి ఆరోపించారు.
అధిక జిడిపి అని చెప్పుకుంటూ ఎక్కువ మొత్తంలో ఏపీ ప్రభుత్వం అప్పులు తీసుకుంటుందని ఆరోపించారు. మద్యంపై వచ్చే డబ్బును ఆదాయంగా చూపించి ఆదాయం పెరిగిందనడం సరికాదని దుయ్యబట్టారు.
జగన్ పాలనలో ఏపీకి పరిశ్రమలు రాలేదని, ఇండస్ట్రీలు లేకుండా ఆదాయం ఎలా పెరిగిందని ఆమె ప్రశ్నించారు. తమ ప్రభుత్వ పాలనలో ఖజానాపై ఇంత అప్పుల భారాన్ని పెట్టుకొని సుపరిపాలన అని సీఎం జగన్ చెబుతున్నారని ఎద్దేవా చేశారు. మరి, పురందేశ్వరి వ్యాఖ్యలపై వైసీపీ నేతల రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.