అత్యున్నత పదవుల్లో ఉన్నప్పటికి బలమైన ఆరోపణలు వచ్చినంతనే.. అతనెంత పెద్ద నేత అయినా సరే.. వారి పదవికి రాజీనామా చేయాలని.. నిజాయితీని నిరూపించిన తర్వాతే పదవులు ఇస్తామన్న మాట గతంలో రాజకీయ పార్టీలు స్పష్టంగా చెప్పేసేవి. బ్యాడ్ లక్ ఏమంటే.. ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. కేంద్ర మంత్రుల మీద ఆరోపణలు వచ్చినా.. వారు నోరు జారి ప్రభుత్వ పరువు తీస్తున్నా పట్టించుకోని తత్త్వం ఎక్కువైందన్న విమర్శ ఉంది. కేంద్రంలోని మోడీ సర్కారుకు ఏ మాత్రం తీసిపోని రీతిలో.. ఆ మాటకు వస్తే పది ఆకులు చదివినట్లుగా ఎంతటి ఆరోపణలు వచ్చినప్పటికి పెద్దగా పట్టనట్లుగా వ్యవహరించటం గడిచిన కొంతకాలంగా చూస్తున్నాం.
దీంతో.. ఎన్ని ఆరోపణలు వచ్చినా సరే పదవులు సురక్షితమన్న భావన అంతకంతకూ పెరిగిపోతోంది. ఎప్పుడైనా ఒకట్రెండు సందర్భాల్లో వ్యక్తిగతంగా ఉండే లెక్కల్లో తేడా వస్తే తప్పించి.. చర్యలు తీసుకునే పరిస్థితి లేకుండాపోతోంది. ఇలాంటి సమయంలో.. పంజాబ్ లో కొత్తగా ఏర్పడి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించింది. కొత్త ప్రభుత్వంలో అవినీతి ఆరోపణల మీద చర్యలు తీసుకుంటే నష్టం జరుగుతుందన్న లెక్కల్ని పట్టించుకోకుండా.. వెనుకా ముందు చూడకుండా చర్యల కత్తిని ఝుళిపించిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తాజాగా పంజాబ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ సింగ్లాను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నారు. టెండర్లపై అధికారుల నుంచి ఒక శాతం కమిషన్ డిమాండ్ చేశారంటూ మంత్రిపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు అందిన వెంటనే వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. దీనికి సంబంధించి సింగ్లాపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ కావటం సంచలనంగా మారింది. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ.. తమ ప్రభుత్వంలో ఒక్క శాతం అవినీతిని సైతం సహించేది లేదని స్పష్టం చేశారు.
తమపై ఎంతో నమ్మకంతో పంజాబ్ ప్రజలు ఓట్లు వేశారని.. వారికి అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశానికి కేజ్రీవాల్ లాంటి కొడుకు.. భగవంత్ మాన్ లాంటి సైనికుడు ఉన్నంత కాలం అవినీతిపై యుద్ధం కొనసాగుతూనే ఉంటుందన్నారు. సింగ్లా తన తప్పుల్ని అంగీకరించారన్నారు. ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినంతనే తన మంత్రివర్గంలోని మంత్రిపై కేజ్రీవాల్ సైతం ఇదే తరహా వేటు వేయగా.. తాజాగా పంజాబ్ ముఖ్యమంత్రి ఆ కోవలోకి చేరారు. అవినీతి ఆరోపణలపై సొంత పార్టీ నేతలపై చర్యలు తీసుకునే చిత్తశుద్ధి.. ధైర్యం ఉన్న ఏకైక పార్టీ ఆప్ మాత్రమేనని ఆ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా వ్యాఖ్యానించారు.
తాజా పరిణామంపై ఆయన ట్వీట్ చేస్తూ.. గతంలో ఢిల్లీలో చూశామని.. ఇప్పుడు పంజాబ్ లో చూస్తున్నట్లుగా పేర్కొన్న ఆయన.. ‘అవినీతిని సహించేది లేదు. సీఎం తీసుకున్న నిర్ణయం అభినందనీయం’ అంటూ ట్వీట్ చేశారు. ఒకవైపు ఏపీలో.. అధికార పార్టీ ఎమ్మెల్సీ తన మాజీ కారు డ్రైవర్ ను హత్య చేశారన్న ఆరోపణను ఒప్పుకున్న ఆయన విషయంలో ఏపీ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుకు.. పంజాబ్ ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరుకు మధ్యనున్న వ్యత్యాసం ఏమిటన్నది ఇప్పుడు చర్చగా మారిందని చెప్పక తప్పదు.