పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు.
ఈ రోజు సాయంత్రం 5 గంటలకు పంజాబ్ కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగాల్సి ఉండగా అంతకంటే ముందే ఆయన రాజీనామా చేశారు.
కొద్దిసేపటి కిందట ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ కలిసి తన రాజీనామా పత్రం అందించారు.
గత ఏడాది కాలంగా ప్రస్తుత పీసీసీ చీఫ్ నవ్‌జోత్ సింగ్ సిద్ధూ, ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మధ్య తీవ్రమైన అభిప్రాయభేదాలు నెలకొన్నాయి.
ముఖ్యమంత్రిని తొలగించాలని సిద్ధూ హైకమాండ్‌ను పట్టుబడుతూ వచ్చారు.
ఇటీవల హైకమాండ్ ఇరువురు నేతల మధ్య రాజీకి ప్రయత్నించినా, అది కుదిరినట్లే కుదిరి మళ్లీ మొదటికి వచ్చింది.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల సమావేశానికి పార్టీ హైకమాండ్ ఆదేశాలివ్వడంతో అమరీందర్ సింగ్ సీఎం పీఠం నుంచి తప్పుకోవచ్చన్న వాదనలకు బలం చేకూరింది.
శనివారం నాడు లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరుగుతుందని పంజాబ్ కాంగ్రెస్ వ్యవహాహారాల ఇంఛార్జ్ హరీశ్ రావత్ శుక్రవారం ట్వీట్ చేయగా, పీసీసీ చీఫ్ సిద్ధూ దానిని రీట్వీట్ చేశారు.
అంతకు ముందు శనివారంనాటి సమావేశంలో కీలక నిర్ణయాలు జరుగుతాయంటూ మాజీ పీసీసీ చీఫ్ సునీల్ జాఖడ్ చేసిన ట్వీట్ సీఎం రాజీనామా ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.
ఈ సమస్యకు రాహుల్ గాంధీ సీరియస్ పరిష్కారం చూపబోతున్నారని, ఈ నిర్ణయం వల్ల పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పని చేస్తాయని జాఖడ్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ, ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ మధ్య వివాదం చాలా కాలంగా నడుస్తోంది.
సిద్ధూ బీజేపీని వదిలి కాంగ్రెస్‌లోకి వచ్చినప్పటి నుంచి వారి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.
కాంగ్రెస్‌లోకి వచ్చిన సిద్ధూకు మంత్రి పదవి దక్కింది. అయితే సీఎంతో విభేదాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. చివరకు సిద్ధూ మంత్రి పదవికి రాజీనామా కూడా చేశారు.
అమరీందర్ సింగ్‌కు ఇష్టం లేకపోయినా, కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధూకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చింది.
ఆ తర్వాత ఇద్దరి మధ్య దూరం మరింత ముదిరింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు.
కొన్నాళ్లు ఇద్దరు నేతలు దిల్లీకి వచ్చి కాంగ్రెస్ పెద్దలను కలిశారు. ఆ సమయంలో ఇద్దరి మధ్యా ఒప్పందం కుదిరిందని, విభేదాలు సమసిపోయాయని ప్రచారం జరిగింది.
కానీ, తాజా ఘటనల తర్వాత వారిద్దరి మధ్య ఎలాంటి ఒప్పందం జరగలేదని స్పష్టమైంది.
వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి, ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన తరుణంలో పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ విభేదాలు రచ్చకెక్కాయి.
మరి అమరీందర్ కాంగ్రెస్‌లోనే ఉంటారా.. కొత్త పార్టీ పెడతారా.. లేదంటే వేరే ఏదైనా పార్టీలో చేరుతారా అనేది చూడాలి.
మొత్తానికి త్వరలో ఎన్నికలు జరగనున్న పంజాబ్‌లో సీఎం రాజీనామాతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.