తొలి విడత పంచాయతీ ఎన్నికలకు ముందు పలువురు అభ్యర్థులను వైసీపీ నేతలు భయభ్రాంతులకు గురిచేసిన సంగతి తెలిసిందే. కొందరిని నామినేషన్ వేయకుండా బెదిరించగా….మరికొందరిపై దాడులు, దౌర్జన్యాలకు తెగడబ్డారన్న ఆరోపణలు వచ్చాయి. ఇటువంటి ఘటనలు ఏపీలో చాలా జరిగాయి. అయితే, వాటిలో అత్యంత ప్రాధాన్యత కలిగిన మూడు ఘటనలు వైసీపీకి చెంపపెట్టు లాంటివి. మిగతా చోట్ల ఎలా ఉన్నా…ఈ మూడు చోట్ల వైసీపీ దౌర్జన్యాలకు ఎదురొడ్డి మరీ టీడీపీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందిన వైనం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒకేసారి వైసీపీకి మూడు షాక్ లు ఇచ్చిన వైనం సర్వత్రా ఆసక్తి రేపుతోంది.
పుంగనూరులో టీడీపీ బలపరిచిన అభ్యర్థి అంజిరెడ్డి నామినేషన్ వేయడానికి వెళుతుండగా వైసీపీ నేత భాస్కర్ రెడ్డి అనుచరులు ఆయనను అడ్డుకున్నారు. అంజిరెడ్డి దగ్గర నుంచి నామినేషన్ పత్రాలు లాక్కొన్ని చింపివేయడానికి వారు ప్రయత్నించారు. అయినప్పటికీ పెద్దాయన అంజిరెడ్డి…వారికి ఎదురు నిలిచారు. దాదాపు 10 మంది మీదపడి నామినేషన్ పత్రాలు లాక్కునేందుక ప్రయత్నిస్తున్నా…అదరలేదు బెదరలేదు.
అంతేకాదు, దమ్ముంటే ఎన్నికల్లో చూసుకుందాం…అంటూ తొడగొట్టి మరీ వారికి సవాల్ విసిరారు అంజిరెడ్డి. ఈ పెద్దాయన ధైర్యానికి మెచ్చిన చంద్రబాబు…అంజిరెడ్డి వెన్నంటే ఉన్నామని భరోసా ఇస్తూ ట్వీట్ కూడా చేశారు. అంజిరెడ్డిపై దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చంద్రబాబు నమ్మకానికి తగ్గట్టే ప్రజలు న్యాయాన్ని, అంజిరెడ్డిని ఒకేసారి గెలిపించారు. ఇది వైసీపీకి మొదటి షాక్.
ఇక, శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ సర్పంచ్ ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా చర్చకు తెరలేపిన సంగతి తెలిసిందే. టీడీపీ బలపరిచిన అభ్యర్థి గెలుపు కోసం ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఆయనను జగన్ సర్కార్ అరెస్టు చేయించింది. అయినప్పటికీ, నిమ్మాడ ప్రజలు అచ్చెన్న , టీడీపీ మద్దతిచ్చిన కింజారపు సురేష్ కు పట్టం కట్టారు. వైసీపీ బలపరిచిన కింజారపు అప్పన్నపై కింజారపు సురేష్ 1700 ఓట్లతో ఘన విజయం సాధించి సత్తా చాటారు. నిమ్మాడలో వైసీపీ నేత దువ్వాడ వీరంగం వేసినా…సురేష్ విజయాన్ని ఆపలేకపోయారు. ఇది, వైసీపీకి రెండో షాక్.
ఇక, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ స్వగ్రామం కర్నూలు మండలం పీ.రుద్రవరంలో టీడీపీ ఎంకే మధు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైసీపీ ఎంపీ స్వగ్రామం అయినప్పటికీ ప్రజలు…మధువైపే మొగ్గు చూపారు. ఇది వైసీపీకి మూడో షాక్. ఇలా, వైసీపీ నేతలు ఎంత ఓవర్ యాక్షన్ చేసినా సరే…ప్రజా తీర్పు ముందు తలవంచక తప్పలేదన్న టాక్ వస్తోంది. అధికారం ఉంది కదా అని అన్నిచోట్లా గెలుపు దక్కదన్న విషయాన్ని వైసీపీ నేతలు గుర్తెరగాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దౌర్జన్యం, దాడులు, బెదిరింపులతో ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదంటున్నారు.