పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరుగా పుల్లారెడ్డి స్వీట్స్ ను చెప్పాలి. దశాబ్దాల తరబడి తెలుగు ప్రజలకు సుపరిచితమైన ఈ పేరు.. అయితే విద్య, అథ్యాత్మిక కార్యక్రమాల్లోనూ.. సేవా కార్యక్రమాల్లో తప్పించి మరెలాంటి అంశాల్లోనూ వీరి పేరు వినిపించదు. రోజులు మారినా.. కొత్త కొత్త స్వీట్ హౌస్ లు వస్తున్నా.. నేతి మిఠాయిలకు కేరాఫ్ అడ్రస్ గా.. తెలుగు వారి అసలు సిసలు స్వీట్ హౌస్ గా పుల్లారెడ్డికి ఉన్న పేరు ప్రఖ్యాతులకు మరెవరికీ లేదనే చెప్పాలి. జి. పుల్లారెడ్డి స్వీట్ హౌస్ అన్నంతనే నాణ్యతకు.. నమ్మకానికి కేరాఫ్ అడ్రస్ గా చెబుతారు. అలాంటి పుల్లారెడ్డి స్వీట్స్ వారి పేరు తాజాగా పోలీసు కేసు.. పోలీస్ స్టేషన్ లాంటి మాటలు వినిపించటం షాకింగ్ గా మారింది.
ఈ స్వీట్ల సామ్రాజ్యానికి వారసుడిగా వ్యవహరిస్తున్న ఏక్ నాథ్ రెడ్డి (జి. పుల్లారెడ్డి మనమడు) తన భార్యను తీవ్రంగా హింసించినట్లుగా ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. భార్యే స్వయంగా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం సంచలనంగా మారింది. అంతేకాదు.. అతగాడి వేధింపులు ఎంత ఎక్కువ అయ్యాయి అన్న దానికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు బయటకు వచ్చి వైరల్ అవుతోంది. అందులో.. ఇంట్లోనే రాత్రికి రాత్రి గోడ కట్టేయటం ద్వారా తనను బంధించినట్లుగా ఏక్ నాథ్ సతీమణి ప్రగ్యారెడ్డి పేర్కొన్నారు.
తాజాగా ఆమె జీరో ఎఫ్ఐఆర్ విధానంలో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో గృహ హింస చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఏక్ నాథ్ రెడ్డి తండ్రి రాఘవరెడ్డి ప్రస్తుతం జి. పుల్లారెడ్డి గ్రూప్ నకు ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. 2014లో ఏక్ నాథ్ రెడ్డికి ప్రగ్యారెడ్డికి వివాహమైంది. వీరి రిసెప్షన్స్ ను జేఆర్ కన్వెన్షన్ లో అంగరంగ వైభవంగా జరిపారు. ఇక.. ప్రగ్యారెడ్డి విషయానికి వస్తే.. ఆమె తండ్రి మైనింగ్ వ్యాపారం చేస్తుంటారు. పేరున్న కుటుంబం కావటంతో తామిక ఆలోచించకుండా పుల్లారెడ్డి కుటుంబంతో తాము వియ్యం అందుకున్నట్లుగా వారు చెబుతున్నారు.
ఏక్ నాథ్ రెడ్డికి.. ప్రగ్యారెడ్డికి మధ్య కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నాయి. దీంతో.. వీరిద్దరి మధ్య గొడవలు సాగుతున్నాయి. అవేమిటన్న విషయం బయటకు రాలేదు. కాకుంటే.. తాజాగా భార్య బయటకు రాకుండా ఉండేందుకు వీలుగా రాత్రికి రాత్రి.. ఇంట్లోని మేడ మీద నుంచి కిందకు రాకుండా ఉండేలా సిమెంట్ బ్నిక్స్ తో గోడ కట్టేసి.. ఇంటికి తాళం వేసి వెళ్లినట్లుగా ప్రగ్యారెడ్డి ఆరోపిస్తున్నారు. దీంతో.. ఆమె తన తల్లిదండ్రులకు తానున్న పరిస్థితి గురించి సమాచారం ఇచ్చారు. దీంతో వారు ఇంటికి వచ్చారు. డయల్ 100కు ఫోన్ చేసి.. ఇంట్లో నుంచి బయటకు వచ్చారు ప్రగ్యారెడ్డి. అనంతరం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఆమె భర్తపై ఫిర్యాదు చేశారు.
దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఏక్ నాథ్ రెడ్డిపై గృహహింస, వరకట్న వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఏక్ నాథ్ రెడ్డి ఎక్కడ ఉన్నారన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది. ఇప్పటివరకు కుటుంబ పరంగా ఎలాంటి వివాదాలు లేని ఇంట్లో ఇలాంటి పరిస్థితా? అంటూ విస్మయానికి గురవుతున్న పరిస్థితి. భార్యను ఇంట్లో పెట్టేసి.. ఆమె పై అంతస్తు నుంచి కిందకు రాకుండా రాత్రికి రాత్రి గోడ ఎందుకు కట్టేశారు? ఇంటికి తాళం ఎందుకు వేశారు? లాంటి ప్రశ్నలకు ఏక్ నాథ్ రెడ్డిని విచారిస్తే బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. అతడ్ని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.