ఎదుటోడి కోటను కొల్లగొట్టాలంటే ముందు మన కోట భద్రంగా ఉంచుకోవాలి. ఆ విషయంలో ఏ చిన్న తేడా వచ్చినా.. మొదటికే మోసం ఖాయం. తాజాగా అలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. తాను సాధించిన చారిత్రక విజయాన్ని వినయంగా.. ఒద్దిగా తీసుకొని పాలన చేసి ఉంటే.. ఆయనకు తిరుగు ఉండేది కాదు. కానీ.. ఇవాల్టి రాజకీయాల్లో అంత పద్దతిగా పాలన చేయటం అసాధ్యమే. అయితే.. మరీ ఆరాచకంగా కాకున్నా.. ఒక మోస్తరు పద్దతిగా వ్యవహరిస్తూ.. అనవసరమైన విషయాల జోలికి వెళ్లకుండా ఉంటే సరిపోయేది.
కానీ.. అందుకు భిన్నంగా వ్యవహరించిన తీరు ఇప్పుడు కొత్త చికాకులకు కారణంగా మారుతోంది. విపక్షనేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం కోట మీద వైసీపీ జెండా ఎగురవేయాలన్న తపన జగన్ కు ఎంతన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. స్థానిక ఎన్నికల వేళ.. కుప్పం విషయంలో ప్రత్యేక శ్రద్ధను ప్రదర్శించిన జగన్.. తానెంత పట్టుదలతో ఉన్నానన్న విషయాన్ని చేతలో చూపించిన వైనం టీడీపీ మీద సానుభూతి పెంచేలా చేసింది. అదేసమయంలో వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ జైత్రయాత్ర కుప్పం నుంచే మొదలు కావాలంటూ ఆయన చేసిన ప్రకటన అప్పట్లో కొత్త చర్చకు తెర తీసింది.
ఎంత కుప్పం అయితే మాత్రం అంత కసిగా వశం చేసుకోవాలా? అన్న చర్చ జరిగేలా చేసింది. ఇదే జగన్ కు ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే.. రాజకీయాల్లో ఏది ఎలా ఉన్నా.. గీతలు దాటే విషయంలో ప్రజలు నిశితంగా పరిశీలిస్తుంటారు. ఏ చిన్న తేడాను వారు ఒప్పుకోవటానికి సిద్ధంగా ఉండరు. కుప్పం మీద ప్రత్యేక శ్రద్ధను చూపాల్సిన అవసరం లేదని.. వైరాన్ని వ్యక్తిగత స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తాయి. ఇదిలా ఉంటే.. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన సొంత అసెంబ్లీ నియోజకవర్గమైన పులివెందులలో టీడీపీ అభ్యర్థికి మెజార్టీ లభించటం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ వ్యవహారంపై పెద్ద చర్చే జరిగింది. చివరకు పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ వశం కావటం సీఎం జగన్ కు పెద్ద తలనొప్పిగా మారింది. పులివెందుల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రామగోపాల్ రెడ్డికి నాలుగు వేలకు పైగా ఓట్లు పోలయ్యాయి. మొత్తం 10,500 ఓట్లు ఉంటే.. అక్కడ పోలైన ఓట్లు 7వేలకు పైనే. అందులో యాభైఐదు శాతం కంటే ఎక్కువ ఓట్లు టీడీపీ అభ్యర్థికి పోల్ అయ్యాయి. దీంతో.. వైసీపీ అభ్యర్థికిమెజార్టీ తగ్గింది. టీడీపీ అభ్యర్థి గెలుపులో పులివెందులలో పడిన ఓట్లు పెద్ద ఇబ్బందినే తెచ్చి పెట్టాయి. జగన్ కు తన సొంత నియోజకవర్గమే పరాభవాన్ని మిగిల్చింది.
ఇదిలా ఉంటే.. తాజాగా వెలువడిన ఎమ్మెల్సీ ఎన్నికల వేళ.. కొత్త చర్చ మొదలైంది. ఇవాల్టి సంగతి సరే.. 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం జగన్ పోటీ చేసే పులివెందులలో 2019 నాటి మెజార్టీ కంటే ఏ మాత్రం తగ్గినా.. నైతికంగా ఇబ్బందికర పరిస్థితులను జగన్ ఎదుర్కోవాల్సి ఉంటుందంటున్నారు. అనవసరమైన భేషజాలకు పోయి.. విపక్ష నేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహించే కుప్పం కోటను బద్దలు కొడతామని మాటలు చెప్పి.. ఇవాల్టి రోజున పులివెందులలో వచ్చే మెజార్టీ మీద ఇప్పుడు ప్రత్యేక ఫోకస్ చేయాల్సిన అవసరం రావటం ఏమిటన్న అయోమయంలో వైసీపీ నేతలు పడుతున్నట్లు చెబుతున్నారు.
2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ కు 1,32,356 ఓట్లు పట్టాయి. మొత్తం పోలైన ఓట్లలో 73 శాతం ఓట్లు ఆయనకు పడ్డాయి. దీంతో ఆయన మెజార్టీ 90,110గా నమోదైంది. ఈ భారీ మెజార్టీ మీద అప్పట్లో ఆనందోత్సాహాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడదే టెన్షన్ గా మారింది. వచ్చే ఎన్నికల్లో ఈ మెజార్టీ ఏ మాత్రం తగ్గినా ఎదురయ్యే విమర్శలు అన్ని ఇన్ని కావంటున్నారు. ఐదు నుంచి పది వేల వరకు తగ్గితే ఫర్లేదు కానీ.. అంతకుమించి జరిగితే మాత్రం జగన్ కు ఇబ్బందికర పరిస్థితులు ఖాయమంటున్నారు. ఇలాంటి పరిస్థితి ఇంతకు ముందు ఎప్పుడు ఎదురుకాలేదంటున్నారు. ఎదుటోడి కోటకు కన్నం వేయాలన్న తహతహ సొంత కోట గురించి సుదీర్ఘంగా ఆలోచనల్లో పడాల్సిన పరిస్థితి తెచ్చిందన్న మాట వినిపిస్తోంది. దీన్ని వైసీపీ వారి మాటల్లో చెప్పాలంటే.. కర్మ సిద్ధాంతం అనాలా?