పుస్తెలు అమ్మైనా సరే.. పులస తినాల్సిందే అన్నది ఉభయ గోదావరి జిల్లాల్లో బాగా ప్రాచుర్యంలో ఉన్న ఒక నానుడి. అలా ఉంటుంది పులస చేపకు డిమాండ్. డిమాండే కాదు, ఆ డిమాండుకు తగ్గ రేటు…రేటుకు తగ్గ రుచి కూడా ఉంటుంది. అందుకే, రేటు ముఖ్యం కాదు..పులస దొరికితే చాలు అని పులకరించిపోయే పులసాభిమానులు చాలామంది ఉన్నారు. కేవలం గోదావరి పరివాహక ప్రాంతంలో మాత్రమే దొరికే పులస చేప రుచిని జీవితంలో ఒక్కసారైనా చూడాలని తెలుగోళ్లంతా…ముఖ్యంగా గోదారోళ్లు ఉవ్విళ్లూరుతుంటారు.
వర్షాకాలంలో మాత్రమే చాలా అరుదుగా దొరికే పులస గోదావరి నదికి ఎదురీదుతూ వెళుతుంది. పులస చేపల రుచి మరే చేపకు రాదు. ఒకసారి దాని రుచి మరిగిన వారు జీవితంలో మర్చిపోలేరు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అంతా పులసకు వీరాభిమానులే. అందుకే, వాటికి అంత గిరాకీ. ఇక, జాలర్ల వలలో వందల చేపలు పడడం ఒక వైపు అయితే….ఒక్క పులస చేప పడడం మరోవైపు అన్నట్లుంటుంది లెక్క.
పులస చేపను కొనేందుకు వందలాదిమంది జనం కూడా క్యూ కడుతుంటారు. ఇక, పులసకున్న డిమాండ్ నేపథ్యంలో ఏ ఒక్కరికో దానిని అమ్మలేక వేలం పాటలు కూడా నిర్వహిస్తుంటారు. ఈ విధంగా, తాజాగా గోదావరిలో ఓ జాలరి వలలో పడ్డ పులస చేప రికార్డు ధరకు అమ్ముడుపోయింది. మామూలుగా అయితే కేజీ 4 నుంచి 5 వేలుంటుంది. కానీ, తాజాగా రెండు కేజీల బరువున్న పులస చేప ఏకంగా 20 వేలకు అమ్ముడుపోవడం హాట్ టాపిక్ గా మారింది.
గోదావరి వరద ఉద్ధృతి తగ్గడంతో మత్స్యకారులకు పులస చేపలు చిక్కుతున్నాయి. దీంతో, యానాం మార్కెట్లో వాటి విక్రయాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఇక్కడ నిర్వహించిన వేలంపాటలో కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా రెండున్నర కిలోల పులస చేపను రూ. 19 వేలకు పార్వతి అనే మహిళ దక్కించుకుంది. ఆ తర్వాత భైరవపాలేనికి చెందిన వ్యక్తికి దానిని రూ. 20 వేలకు అమ్మేసింది. ఈ సీజన్లో పులసకు పలికిన అత్యధిక ధర ఇదేనని మత్స్యకారులు చెబుతున్నారు. రెండేళ్ల క్రితం రెండున్నర కిలోల పులస చేప రూ.21వేల ధర పలికింది. ఇదే, చేప సముద్రంలో దొరికితే దానిని ‘వలస’ చేప అంటారు.