తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోలీసులు కేసు నమోదు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పోలీస్ స్టేషన్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై కేసు నమోదు అయింది. కేసులో పలు కారణాలను పోలీసులు నమోదు చేశారు.
నారా లోకేష్ తన పర్యటనలో ట్రాక్టర్ నడుపుతుండగా అదుపుతప్పి కాలువలోకి వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సంఘటన చాలా చిన్నది. చిన్న అపశృతి మాత్రమే. అందరూ ట్రాక్టర్ దిగి వెళ్లిపోయారు. అయితే.. పోలీసులు మాత్రం దీన్ని వదిలిపెట్టలేదు.
ఆకివీడు మండలం సిద్ధాపురం వద్ద అవగాహన లేకుండా ట్రాక్టర్ నడుపుతూ.. పది మందిని ట్రాక్టర్ ఎక్కించుకుని, వారి ప్రాణాలకు హాని కలిగే విధంగా డ్రైవింగ్ చేసారని ఒక కారణంగా చూపుతూ కేసు పెట్టారు.
కోవిడ్ 19 నిబంధనలు పాటించకుండా కార్యక్రమాలు నిర్వహించినందుకు సుమోటోగా మరో కేసు నమోదు అయింది. 279 ipc,184,51/A, IPC 3 pandemic… సెక్షన్లు కింద లోకేష్ పై కేసులు పెట్టారు.
తెలుగుదేశం నేతలపై కొవిడ్ నిబంధనల కేసులు వరుసగా నమోదు అవుతూనే ఉన్నాయి. ప్రత్యేకించి అనంతపురం జిల్లాకు చెందిన జెసి ప్రభాకరరెడ్డి బెయిల్పై జైలు నుంచి విడుదలైనప్పుడు.. కొవిడ్ నిబంధనలు పాటించలేదంటూ.. వెంటనే అరెస్టు చేశారు. కరోనాతో ఆస్పత్రిలో వైద్యం చేయించుకుని తిరిగి వెళుతున్నప్పుడు.. కొవిడ్ నిబంధనలు పాటించలేదని మళ్లీ కేసు పెట్టి అరెస్టు చేశారు.
ఈ నేపథ్యంలో ఇదే కొవిడ్ నిబంధనల కేసు కింద నారా లోకేష్ ను కూడా అరెస్టు చేస్తారా అనే చర్చ రాష్ట్రంలో మొదలవుతోంది.