దేశంలోని మిగిలిన రాష్ట్రాల్ని పక్కన పెడితే.. తెలుగు ప్రజలు వెళ్లే ఫుణ్యక్షేత్రాలు ప్రముఖంగా రెండు కనిపిస్తాయి. అందులో మొదటిది తిరుమల అయితే రెండోది శిర్డీ. రెండు తెలుగు రాష్ట్రాల్లో బోలెడన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నప్పటికీ.. భక్తులు ఎక్కువగా వెళ్లే పుణ్యక్షేత్రాల్లో ఈ రెండు అగ్రస్థానంలో నిలుస్తాయి. అలాంటి శిర్డీలో మే 1 నుంచి బంద్ నిర్వహిస్తున్నారు. అది కూడా నిరవధికంగా. ఎందుకిలా? అసలేం సమస్య? అన్న విషయంలోకి వెళితే.. శిర్డీ సాయిబాబా ఆలయానికి సీఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యురిటీ ఫోర్స్)భద్రతను ఏర్పాటు చేయాలన్న నిర్ణయమే తాజా బంద్ కు కారణమని చెబుతున్నారు.
శిర్డీలోని సాయిబాబా మందిరానికి మరింత భద్రత కల్పించాలన్న ఆలోచనలో భాగంగా ఈ ప్రత్యేక దళాలతో భద్రత కల్పించాలని భావిస్తున్నారు. దీన్ని శిర్డీ గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకే.. సీఐఎస్ఎఫ్ భద్రత వద్దంటూ శిర్డీ పట్టణం మొత్తం నిరవధికంగా బంద్ ను పాటించాలని నిర్ణయించారు. అసలీ పరిస్థితి ఎందుకు వచ్చిందన్న విషయంలోకి వెళితే.. మరింత మెరుగైన భద్రత కోసం ఈ ఫోర్సును ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన.
అయితే.. దీన్ని షిర్డీ ప్రజలు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారన్న విషయానికి వస్తే.. ఇప్పటివరకు వీరు పారిశ్రామిక సంస్థలు.. విమానాశ్రయాలు.. మెట్రో స్టేషన్లు తప్పించి షిర్డీ లాంటి ఆలయానికి భద్రత బాధ్యతల్ని చేపట్టింది లేదు. ఆలయ నిర్వాహణకు సంబంధించి వచ్చే సవాళ్లను డీల్ చేసే నైపుణ్యం వీరికి ఉందని వారు వాదిస్తున్నారు. సీఐఎస్ఎఫ్ బలగాల్నివ్యతిరేకిస్తున్న వారిలో షిర్డీ ప్రజలు.. వ్యాపారులు ఉన్నారు. సీఐఎస్ఎఫ్ రంగంలోకి దిగితే.. వారు పెద్ద ఎత్తున ఆంక్షలు అమలు చేస్తారని.. దీంతో పర్యాటకులకు.. తమకు తీవ్ర ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు.
అదే జరిగితే తమ ఉపాధికి గండి పడటం ఖాయమన్నది వారి వాదన. ఈ నేపథ్యంలో శిర్డీకి చెందిన స్థానికులు.. వ్యాపారులు.. అన్ని సంఘాల వారు సమావేశమైన నిరవధిక బంద్ నిర్ణయాన్ని తీసుకున్నారు. శిర్డీ పట్టణంలో బంద్ నిర్వహిస్తున్నా.. ఆలయం మాత్రం తెరిచే ఉంటుంది. సాయి సంస్థాన్ ట్రస్టు నిర్వహించే ఉచిత అన్నదానం.. ట్రస్టుకు సంబంధించిన వసతి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. బంద్ సందర్భంగా గ్రామస్తుల డిమాండ్లను చూస్తే.. ‘‘సాయి బాబా మందిరానికి సీఐఎస్ఎఫ్ భద్రత వద్దు. సాయిబాబా సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టు రద్దు చేయాలి. ప్రభుత్వ డిప్యూటీ కలెక్టర్.. తహసీల్దార్.. ప్రాంతీయ అధికారితో కమిటీ ఉండాలి. సంస్థాన్ ట్రస్టీల బోర్డును వీలైనంత త్వరగా నియమించాలి.
అందులో 50 శాతం ధర్మకర్తలు శిర్డీకి చెందిన వారే అయి ఉండాలి’’ అని చెబుతున్నారు. ఇంతకీ ఇదంతా ఎందుకు మొదలైందంటే.. 2018లో సామాజిక కార్యకర్త సంజయ్ కాలే బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ లో ఆలయ భద్రతపై పిల్ దాఖలుచేశారు. దీనిపై విచారణ జరిపిన బెంచ్.. సాయి సంస్థాన్ అభిప్రాయాన్ని కోరగా వారు సీఐఎస్ఎఫ్ భద్రతకు మద్దతు పలికారు. దీనిపై గ్రామస్థలు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. బంద్ వేళ.. ఆలయానికి వెళ్లాలనుకున్న వారు వెళ్లొచ్చు కానీ.. స్థానికంగా మాత్రం ఎలాంటి వసతులు ఉండవన్న విషయాన్ని మాత్రం పరిగణలోకి తీసుకొని యాత్రకు ప్లాన్ చేసుకోవటం మంచిది.