ఏపీ రాజధాని అమరావతిని తుంగలో తొక్కి అవినీతి, అక్రమాలు జరిగాయంటూ.. వైసీపీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజధాని అమరావతి నిర్మాణాన్ని కూడా అటకెక్కించింది. ఈ క్రమంలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు.. పెద్ద ఎత్తున ఉద్యమించారు. పాదయాత్రలు చేశారు. పోరాటాలు సాగించారు. శిబిరాలు ఏర్పాటు చేసుకుని నిరాహార దీక్షలు కూడా చేశారు. అయితే.. వీరిని కూడా వైసీపీ నాయకులు వదిలి పెట్టకుండా.. వేధించారు. వీరంతా పెయిడ్ ఆర్టిస్టులంటూ.. ఎంపీ నందిగం సురేష్ నుంచి అనేక మంది నాయకులు విమర్శించారు.
ఈ క్రమంలోనే ఎంపీ నందిగం సురేష్ వర్గానికి చెందిన కొందరు వైసీపీ నాయకుడు.. ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు రాజధాను లకు మద్దతు ప్రకటించారు. రాష్ట్రం అభివృద్ధితో విలసిల్లాలంటే.. మూడు రాజధానులు కావాలంటూ ఎలుగెత్తారు. రాజధాని రైతులు చేసిన నిజమైన పోరాటాలకు సమాంతరంగా ఫేక్ పోరాటాలు కూడా సాగించారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున శిబిరాలు ఏర్పాటు చేసుకుని మూడు రాజధానుల కోసం ఉద్యమించారు. ఇది ఒకప్పుడు తీవ్ర ఉద్రిక్తతలకు కూడా దారి తీసింది. ఒక వైపు రాజధాని రైతులు ఉద్యమిస్తుంటే.. వీరికి సమాంతరంగా పక్క వీధిలో మూడు రాజధానుల కోసం ఉద్యమించారు.
అయితే.. ఇప్పుడు అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ నేతలు ఏర్పాటు చేసుకున్న మూడు రాజధానుల ఉద్యమానికి సంబంధించిన శిబిరాలను తాజాగా వారే ఎత్తేశారు. మరి ఎంపీ నందిగం సురేష్‌కు తెలిసి చేశారో.. తెలియక చేశారో తెలియదు కానీ.. వారంతా శిబిరాలు ఎత్తేశారు. దీంతో నాలుగేళ్లుగా మందడం గ్రామంలో వైసీపీ నేతలు నిర్వహిస్తున్న మూడు రాజధానుల శిబిరం నేటితో మూతపడింది. ఈ శిబిరం నిర్వాహకుడు, ఎంపీ నందిగంకు కీలక నాయకుడిగా ఉన్న గురునాథం, మరికొందరు నేతలు శిబిరాలను ఎత్తేస్తున్నట్టు ప్రకటించి.. వారే వాటిని తీసేశారు.
అనంతరం.. వారంతా కూటమిగా ఏర్పడి టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. వీరిలో వైసీపీ అనుబంధ బహుజన పరిరక్షణ సమితి నేతలుగా ఉన్నారు. కాగా, విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో ఈ నేతలు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరడం గమనార్హం. దీంతో రాష్ట్రంలో సర్కారు మారుతోందనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.