తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై ఘాటుగా రియాక్టు అయ్యారు సీనియర్ సినీ నిర్మాత ఎన్వీ ప్రసాద్. ఈ మధ్య తెలుగు సినిమా ఇండస్ట్రీ.. సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై రియాక్టు అయిన ప్రసన్నకుమార్ రెడ్డి.. సినిమా ఇండస్ట్రీ వారు బలిసి కొట్టుకుంటున్నారన్న వ్యాఖ్య చేయటం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ అంతే కరకుగా స్పందించటం.. ఊహించని పిలుపును పిలిచి.. సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆయనో విన్నపం చేయటం తెలిసిందే.
ఇలాంటి ఇడియట్ ను మీ పక్కన పెట్టుకుంటే.. మీ రిప్యుటేషన్ పోతుందని పేర్కొనటం తెలిసిందే. వర్మ తర్వాత ఈ అంశంపై మళ్లీ మాట్లాడింది లేదు. ఇలాంటి వేళ తెలుగు ఫిలిం చాంబర్ మాజీ అధ్యక్షుడు.. నిర్మాత ఎన్వీ ప్రసాద్ కంటౌర్ ఇచ్చారు. మీడియా ముందు మాట్లాడితే హీరో అవుతారని అనుకుంటున్నారు.. బలిసి కొట్టుకుంటుంది మీరే అని అంటే మీకెలా ఉంటుందని వ్యాఖ్యానించారు.
నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తండ్రి శ్రీనివాసరెడ్డి ఎంతో గౌరవంతో వ్యవహరించేవారన్నారు. ప్రసన్నకుమార్ రెడ్డి రాజకీయ జీవితం ఏమిటో కొవూరులో అందరికి తెలుసన్న ఆయన.. తమకు సంస్కారం ఉండటంతో ఆయన మాదిరి మాట్లాడటం లేదన్నారు.
సినిమాలోనటించాలంటే వంద అడుగుల రోప్ కట్టుకొని.. రోప్ పైకి నడవటం ఎంత కష్టమో తెలియాంటే సినిమా నిర్మాణం వద్దకు రావాలన్నారు. సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారని.. అది ఆయనకే వర్తిస్తుందన్న ఆయన.. ఇక్కడ ఎవరూ బలిసి కొట్టుకోవటం లేదన్నారు. వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై సినిమా ఇండస్ట్రీ ఇప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇప్పటికి ఎదురవుతున్న కష్టాలు సరిపోవన్నట్లుగా.. తమపై వేస్తున్న నిందలకు సమాధానం చెప్పాలనుకున్నా.. తొందరపడి మాట్లాడితే.. ఎలాంటి సమస్యలు వస్తాయన్న ఆందోళనతో మౌనంగా ఉండిపోతున్నారు. ఇలాంటి వేళ.. వర్మ.. ఎన్వీ ప్రసాద్ లాంటి కొందరు మాత్రమే రియాక్టు కావటం గమనార్హం.