తెలుగు సినీ నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఉత్తరాంధ్రకు ద్రోహం చేసిందని ఆయన అన్నారు. అందుకే తాను టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. “ఉత్తరాంధ్రను మోసం చేసేందుకు రాజధాని పేరుతో జగన్ ఆడుతున్న నాటకమంతా బూటకమనే విషయం ఈ ప్రాంత ప్రజలు గుర్తించారు“ అని నట్టి కుమార్ అన్నారు.
తాను జగన్ అన్నావైసీపీ అన్నా ఎంతో అభిమానం చూపించానని చెప్పిన నట్టి కుమార్ పార్టీ కార్యకర్తలు, నాయకుల విషయంలోనూ సానుభూతిపరుడిగా ఉండేవాడినని తెలిపారు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో విసిగిపోయానన్నారు. అంతా రెడ్డి కుల పాలన చేసేశారని విమర్శించారు. త్వరలోనే తాను చంద్రబాబును కలిసి టీడీపీలో చేరనున్నట్లు వెల్లడించారు. వైసీపీ తమలాంటి వాళ్లను తమ స్వార్థానికి వినియోగించుకుందని ఆయన విరుచుకుపడ్డారు.
విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ దాదాపు రూ. 2 వేల కోట్ల విలువైన చర్చి ఆస్తులను సొంతం చేసుకుం టున్నారని నట్టి కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆస్తులను అమ్మడానికి లేదా కొనడానికి వీలు లేదన్నారు. అయినా, సరే అధికారం అడ్డుపెట్టుకుని చర్చికి కెనడా వాసులు ఇచ్చిన భూములను దోచేస్తున్నారని దుయ్యబట్టారు.
విశాఖకు కోట్లాది రూపాయలు విలువైన పరిశ్రమలొస్తున్నట్లు పరిశ్రమల మంత్రి అమర్నాత్ చెబుతున్నారని, కానీ, ఎక్కడ ఎలాంటి పరిశ్రమలు వచ్చాయో చెప్పాలని నట్టి కుమార్ డిమాండ్ చేశారు. చంద్రబాబు ఆలోచనా విధానానికి, ప్రజా బలం ఉన్న పవన్‌కల్యాణ్ తోడవడంతో జగన్‌కు మతిపోయిందన్నారు. ఈ కారణంగానే వ్యక్తిగత వ్యాఖ్యలతో దండయాత్రలు చేయిస్తున్నాడని విమర్శించారు.