ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సంచలన ప్రకటన చేశారు. శాసన సభ్యులను ఉద్దేశించి.. సభ గౌరవాన్నితగ్గించే విధంగా వార్తలు రాసిన.. మాజీ సీఎం జగన్‌కు చెందిన సాక్షి దినపత్రికకు సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసులు ఇవ్వను న్నట్టు తెలిపారు. అయితే.. దీనిని ముందుగా సభా హక్కుల వ్యవహారాల కమిటీకి పంపిస్తామని.. వారు తీసుకునే నిర్ణయం ఎలాంటిదైనా.. ఎంత సీరియస్‌గా ఉన్నా అమలు చేసి తీరుతామని చెప్పారు. ఈ మేరకు నిండు సభలో మంగళవారం సాయం త్రం ఆయన ప్రకటించారు. ఇదే జరిగితే.. ఏపీ చరిత్రలో ఒక మీడియాకు సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసులు ఇచ్చిన పత్రికగా సాక్షి నిలుస్తుంది.
ఏం జరిగింది?
ఏపీలో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో 70 మందికి పైగా కొత్త సభ్యులు ఎన్నికయ్యారు. వారికి సభా వ్యవహారాలపై శిక్షణ ఇవ్వాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు, సభా నాయకుడు, సీఎం చంద్రబాబునిర్ణయించారు. దీనికి సంబంధించి ప్రత్యేక అతిథిగా పార్లమెంటు స్పీకర్ ఓం బిర్లాను ఆహ్వానించాలని నిర్ణయించారు. దీనికి ముహూర్తం కూడా ఖరారు చేశారు. ఫిబ్రవరి(ఈనెల) 22, 23 తేదీల్లో శిక్షణ తరగతులు పెట్టాలని అనుకున్నారు. అయితే.. దీనికి సంబంధించి పెద్ద అడ్డంకి వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ పోస్టులకు ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో సభ్యులు చాలా మంది ఆయా ఎన్నికల ప్రచారంలో ఉన్నారు.
దీనికితోడు.. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నికల కోడ్‌కు ఇబ్బంది అవుతాయని భావించారు. కానీ, అప్పటికే ఈ విషయంపై పార్లమెంటు స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజులు.. ఆయనను ఆహ్వానించారు. కానీ, తర్వాత.. దీనిని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. దీనికి కారణాలు కూడా అప్పట్లోనే చెప్పుకొచ్చారు. కానీ, ఈ విషయాన్ని ప్రస్తావించకుండా.. సాక్షి పత్రికలో.. సభ్యులకు శిక్షణ కార్యక్రమాల పేరుతో కోట్లాది రూపాయలు దారిమళ్లించారంటూ.. వార్తను ప్రచురించిందని నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య మంగళవారం సభ దృష్టికి తెచ్చారు.
దీనిపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీవ్రంగా స్పందించారు. సాక్షి పత్రిక, మీడియాపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్న జయసూర్య డిమాండ్ ను ఆయన సభలో చదివి వినిపించారు. సభా హక్కులను ఉల్లంఘించారంటూ సాక్షి మీడియాకు ప్రివిలేజ్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఒక అబద్ధపు కథనాన్ని ప్రచురించడమే కాకుండా.. సభ గౌరవాన్ని కూడా తగ్గించే పనిచేశారని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోకపోతే.. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని సభా హక్కుల కమిటీకి రిఫర్ చేస్తామని.. అనంతరం ప్రివిలేజ్ నోటీసులు ఇస్తామని స్పీకర్ పేర్కొన్నారు.
ఏం జరుగుతుంది?
ఈ వార్తను ప్రచురించిన.. సాక్షి ఎడిటర్‌కు సభ నుంచి నోటీసులు వెళ్తాయి. దీంతో సదరు ఎడిటర్ సభకు వచ్చి.. వార్త ఎందుకు రాయాల్సి వచ్చింది.. దీనికి సంబంధించి తమకు ఉన్న ఆధారాలు ఏంటి? అనే వివరాలను సభకు తెలియజేస్తారు. దీనిపై సభ సంతృప్తి చెందితే.. ఈ విషయాన్ని అక్కడితో ముగిస్తారు. లేకపోతే.. సభకు, సభ్యులకు కూడా క్షమాఫణలు చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించాల్సి ఉంటుంది. గతంలో తమిళనాడులో జయ ప్రభుత్వంపై ఇలానే స్థానిక “తంతి“ దినపత్రికకు సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసులు ఇస్తే.. పత్రిక యాజమాన్యం కోర్టుకు వెళ్లి.. ఆర్టికల్ 21(భావప్రకటనా స్వేచ్ఛ) కింద వాదనలు వినిపించి.. బయట పడింది.