సినీ రంగం నుంచి జనసేన పార్టీలోకి తొలిసారి ఒక కళాకారుడు చేరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేతృత్వంలో సదరు యువ కళాకారుడు పార్టీ కండువా కప్పుకొని జనసేనలో చేరారు. దీంతో జనసేనలో కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కళాకారుల కొత్త ఉత్సాహం కనిపించనుంది. వాస్తవానికి సినీ రంగంలో పవర్ స్టార్‌గా దుమ్ము రేపుతున్న పవన్ కళ్యాణ్.. సొంతగా పార్టీ పెట్టారు. 2014లో స్థాపించిన పార్టీలో చేరేందుకు అప్పట్లో చాలా మంది ముందుకు వచ్చారు. అయితే.. పవన్ వారిని వారించారు.
తర్వాత కాలంలో మెగా కుటుంబం నుంచి రామ్ చరణ్ పార్టీలో చేరకపోయినా.. పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు ఉత్సాహం చూపించారు. ఆయనను కూడా పవన్ వారించారు. అయితే..2019లో పార్టీ ఒంటరిగా పోటీ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం మెగా బ్రదర్ నాగబాబును పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన వచ్చి పార్టీలో చేరారు. అంతేకాదు.. నరసాపురం పార్లమెంటు స్థానం నుంచి పోటీకి కూడా దిగారు. ఇదిలావుంటే.. ఏడాది కాలంలో వైసీపీ నుంచి దూరమైన క్యారెక్టర్ నటుడు పృథ్వీ కూడా జనసేనవైపు చూస్తున్నారు. కానీ, పవన్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదు.
ఇక, బుల్లితెర నటులు.. ఆది సహా మరో ఇద్దరు జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ, వారిని కూడా వివిధ కారణాలతో పవన్ దూరం పెట్టారు. తాజాగా ప్రముఖ సినీ నృత్య దర్శకుడు శ్రీ షేక్ జానీ మాస్టర్ @AlwaysJani బుధవారం మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనకు పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ కు దివ్య ఖుర్ ఆన్ గ్రంధాన్ని కానుకగా అందించారు. అనంతరం ఇద్దరూ ఏకాంతంగా సంభాషించుకున్నారు. పార్టీ తరఫున తాను పనిచేసేందుకు సిద్ధమని జానీ తెలిపారు. ఈ మేరకు జనసేన ఒక ప్రకటన విడుదల చేసింది.