- పీఆర్సీపై లాలూచీ! ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారు!!
- సంఘాల నేతలపై ఉద్యోగుల ఫైర్
- ఐఆర్ కంటే తక్కువగా ఫిట్‌మెంట్‌కు
- ఎందుకు అంగీకరించారని నిలదీత
- పీఆర్సీ నివేదికలో ఏముందో తెలియకుండా
- సీఎస్ కమిటీ సిఫారసుల ఆమోదమా?
- 23ు ఫిట్మెంట్ అంటే చప్పట్లా?
- హెచ్ఆర్ఏ కూడా తగ్గించే కుట్ర
- అడ్డుకోకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరిక
- ఎటూ పాలుపోని ఉద్యోగ సంఘాల నేతలు
నవ్యాంధ్రలో కోరి తెచ్చుకున్న జగన్ ప్రభుత్వం చేసిన మోసాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు దానితో లాలూచీ పడి తక్కువ ఫిట్‌మెంట్‌కు అంగీకరించారని కారాలూ మిరియాలూ నూరుతున్నారు. అధికారంలోకి రాగానే 27శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించిన సీఎం జగన్.. వేతన సవరణ విషయంలోనూ ఉదారంగా వ్యవహరిస్తారని ఉద్యోగులు కొండంత ఆశలు పెట్టుకున్నారు.
అదేమీ లేకపోగా.. డీఏలు కూడా ఎగ్గొట్టారు. చివరకు ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ)లో కూడా పెట్టడాన్ని ఉద్యోగులు సహించలేకపోతున్నారు. తమ తమ సంఘాల నేతలను నిలదీస్తున్నారు. హెచ్ఆర్ఏ విషయంలోనైనా కనికరించాలని నాలుగు రోజులుగా ఉన్నతాధికారులను కోరుతున్నా సానుకూల స్పందన లేకపోవడంతో సదరు నేతల పరిస్థితి కుడితిలో పడిన ఎలుకచందంలా మారింది.
ఉద్యోగుల వేతనాలు పెంచేందుకు చంద్రబాబు హయాంలోనే అశుతోష్ మిశ్రా సారథ్యంలో కొత్త వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ)ని నియమించారు. ఏడాదిన్నర కింద మిశ్రా తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఆ నివేదికను ఉద్యోగ సంఘాల నేతలకు ఇచ్చి.. దాని సిఫారసులపై వారితో చర్చించాల్సి ఉండగా.. జగన్ సర్కారు ఆ ప్రక్రియను ప్రారంభించనేలేదు. చివరకు నివేదికను కూడా వారికివ్వలేదు. పైగా దానిపై అధ్యయనానికి చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఓ కమిటీని వేశారు.
ఆ కమిటీ ఆరు నెలల్లో ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. సంఘాల నేతలను చర్చకూ పిలువలేదు. ఉద్యోగుల నుంచి ఒత్తిడి తీవ్రమవడంతో నేతలు పీఆర్సీ నివేదిక కోసం ఆందోళనకు దిగారు. రిపోర్టు అప్పుడిస్తాం.. ఇప్పుడిస్తామంటూ సీఎస్ సమీర్‌శర్మ వాయిదా వేస్తూ వచ్చారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీల్లో ఇస్తామని ఎగ్గొట్టారు.
ఉద్యోగులు ఉద్యమ కార్యాచరణ ప్రకటించడంతో ప్రభుత్వ ముఖ్య సలహాదారు సంఘాల నేతలను చర్చలకు పిలిచారు. కరోనా వల్ల ఆదాయం తగ్గిపోయిందని.. 14.29 శాతం ఫిట్‌మెంట్‌కు అంగీకరించాలని బేరం పెట్టారు. వారు అంగీకరించలేదు. ఐఆర్ కంటే తక్కువిస్తే అంగీకరించేది లేదని, తామడిగిన 55 శాతం కాకున్నా కనీసం 45 శాతమైనా ఇవ్వాలని తేల్చిచెప్పారు.
సీఎంతోనే తేల్చుకుంటామన్నారు. జగన్ వారితో ఈ నెల 7న సమావేశమయ్యారు. తెలంగాణతో పోల్చుకోవద్దని.. కరోనా వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గిందని తప్పుడు లెక్కలు చూపారు. 23.29 శాతం ఫిట్మెంట్ ఇస్తున్నట్లు ప్రకటించారు. నేతలను మచ్చిక చేసుకోవడానికి రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఆ సమయంలో సీఎం మెప్పుకోసమో? భయం కోసమో సంఘాల నేతలు చప్పట్లతో హర్షధ్వానాలు చేశారు. కానీ సీఎం ప్రకటనను అంగీకరిస్తే వేతనాలు పెరగకపోగా ప్రతి ఉద్యోగికీ కనీసం రూ.5,400 నుంచి రూ.11,000 వరకు నష్టం జరుగుతుందని తేలడంతో బిత్తరపోయారు.
సీఎం తన ప్రకటనలో హెచ్ఆర్ఏ ప్రస్తావన తేలేదు. అధికారులతో మాట్లాడాలని సూచించారు. హెచ్ఆర్ఏలో 20 శాతం వరకు కోతపడుతుండడంతో ఉద్యోగుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ లెక్కలన్నీ తెలుసుకోకుండా చర్చలకు ఎలా వెళ్లారు.. సీఎం ప్రకటనను ఆమోదిస్తూ చప్పట్లు ఎలా కొట్టారని నేతలను నిలదీస్తుండడంతో వారు ఇప్పుడు తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది.
ఫిట్‌మెంట్‌పై ఉద్యోగుల్లో వస్తున్న వ్యతిరేకత నుంచి తాళలేక.. అటు సీఎంను, అధికారులను ఒప్పించలేక సతమతమవుతున్నారు. సీఎం వద్ద జరిగిన సమావేశంలో ఒక్క అంశంపై కూడా స్పష్టత లేకుండా బయటకు వచ్చారు. సీఎంతో జరిగిన చర్చలన్నీ సఫలం కావాలని కూడా ఏం లేదు కానీ….ఏం జరిగిందో కూడా తెలియకుండా ఆనందోత్సాహాలతో.. సీఎం అనుకున్నదానికన్నా ఎక్కువ ఇచ్చారు.. సీఎంపై నమ్మకం ఉందని బయటకు వచ్చి పొగడ్తల్లో ముంచెత్తారు.
ఇప్పటికీ ఆరోజు సీఎం ప్రకటించిన రివర్స్ ఫిట్మెంట్ మినహా ఏ అంశంపైనా ఇంచ్ రూడా కదల్లేదు. సీఎంవో అధికారులతో చర్చలు, భేటీల పేరుతో… మళ్లీ అదే కథ.. అదే సీన్స రిపీట్ అవుతుందని… కొది ్దరోజుల తర్వాత ఆ వాడీవేడి తగ్గాక నాయకులందరూ సైలెంట్ అయిపోతారని.. ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు.
నాడు లోపల ఎందుకు చప్పట్లు కొట్టారు… ఉద్యోగులకు ఏం ప్రయోజనం వచ్చిందని కొట్టారు? ఇప్పుడు తలలు పట్టుకోవడం ఎందుకని తమ సంఘాల నేతలపై మండిపడుతున్నారు. అందరు నేతలూ కలిసి తమను నిండా ముంచారని…గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని ఆక్రోశిస్తున్నారు.
ఆ చేత్తో ఈ చేత్తో ఓట్లేసి గెలిపించినందుకు తమకు తగిన శాస్తే జరిగిందని.. తమ వేలితో తమ కన్నే పొడుచుకునేలా చేశారని వాపోతున్నారు. ప్రభుత్వం.. తమ సంఘ నేతలు కలిసి చర్చల పేరుతో సాగదీసి రివర్స్ పీఆర్సీని వరంగా ఇచ్చారని భగ్గుమంటున్నారు. పీఆర్సీ నివేదికను పక్కనపెట్టి సీఎస్ కమిటీ సిఫారసులను తమ ముందుంచినప్పుడే నేతలు వ్యతిరేకించి ఉండాల్సిందని వాపోతున్నారు. తమ నేతలను గుడ్డిగా నమ్మితే నట్టేట ముంచారని బాధపడుతున్నారు.
హక్కులను అడుక్కోవాలా?
తమకు రాజ్యాంగ బద్ధంగా… చట్టబద్ధంగా రావాల్సిన హక్కులను డిమాండ్ చేసి సాధించాల్సింది పోయి.. అడ్డుక్కునే స్థితికి నేతలు దిగజార్చారని ఉద్యోగులు మండిపడుతున్నారు. సంఘాలుగా విడిపోయి డ్రామా క్రియేట్ చేసి… ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ… ఉద్యోగులను మభ్యపెట్టి సంఘాల నేతలందరూ కలిసి ప్రభుత్వ ప్రతినిధులుగా వ్యవహరించి తమను మోసం చేశారని ధ్వజమెత్తుతున్నారు. ప్రభుత్వం మెప్పుకోసం 13 లక్షల మంది ఉద్యోగుల ప్రయోజనాలను తాకట్టుపెట్టారని విమర్శిస్తున్నారు.
ఉద్యోగుల పరువు తీశారు…
గతంలో ఉద్యోగ సంఘాలన్నా… వాటి నేతలన్నా ఒక గౌరవభావం ఉండేదని.. కానీ కంట్రోల్లో ఉంటామని సలహాదారుకు భయభక్తులతో చెప్పి పరువు తీశారని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వమే దిగొచ్చి పరిష్కరించేలా కార్యచరణ రూపొందించకుండా… సలహాదారుల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేయడం ఏమిటని మండిపడుతున్నారు.
చేసిన పనికి… కూలీ అడుగుతున్నామని… ఎవరింట్లో సొమ్ము తెచ్చి తమకు ఇవ్వడంలేదని ఉద్యోగులు అంటున్నారు. పని చేస్తున్నాం.. జీతం పెంచమంటున్నాం… అది రాజ్యాంగం ఉద్యోగులకు కల్పించిన హక్కు అది కూడా కాలరాసేలా తమ నేతల ప్రవర్తన ఉందని ఉద్యోగులు వాపోతున్నారు. ప్రభుత్వానికి లొంగిపోయి… ఉద్యోగుల ప్రయోజనాలపై రాజీ పడ్డారని మండిపడుతున్నారు.