మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు విడదల రజిని పై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి రూ. 2.20 కోట్లు అక్రమంగా వసూల్ చేసిన వ్యవహారంలో విడదల రజినిపై కేసు నమోదైంది. అయితే తనపై అక్రమంగా కేసు పెట్టారని.. దీని వెనుక టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు హస్తం ఉందంటూ విడుదల రజిని ఆరోపణలు చేశారు. వైసీపీ హయాంలో తనతో పాటు తన కుటుంబ సభ్యుల కాల్ డేటాను లావు శ్రీకృష్ణదేవరాయలు సేకరించారని.. జగన్కు తాను ఫిర్యాదు చేయగా ఆయన మందలించడంతో అప్పటి నుంచి తనపై కక్ష పెంచుకున్నారని ఆరోపించారు.
ఈ ఆరోపణలపై ఇప్పటికే ఎంపీ లావు రియాక్ట్ అయ్యారు. ఏసీబీ కేసును డైవర్ట్ చేసేందుకే విడదల రజిని తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తుందని.. ఫోన్ డేటా, భూములు అంటూ తన క్యారెక్టర్ ను తప్పుబట్టేందుకు ప్రయత్నం చేస్తుందని ఎంపీ మండిపడ్డారు. మరోవైపు ఈ వ్యవహారంలో తాజాగా చిలకలూరిపేట టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాజీ ఎమ్మెల్యే విడుదల రజినికి పరోక్షంగా స్ట్రోంగ్ కౌంటర్ ఇచ్చారు. తప్పు చేయనప్పుడు ఉలికిపాటు ఎందుకు అంటూ ప్రత్తిపాటి ప్రశ్నించారు.
గతంలో అవినీతి మంత్రిగా ముద్ర వేయించుకున్న వ్యక్తి నేడు నీతులు చెబుతుండడం ఆశ్చర్యంగా ఉందంటూ విడుదల రజినిపై ప్రత్తిపాటి కౌంటర్ వేశారు. నాడు అధికార గర్వంతో అరాచకాలు చేసి, ఇప్పుడు సానుభూతి పొందేందుకు నిజాయతీపరుడైన ఎంపీ మీద ఆరోపణలు చేస్తే సరిపోతుందా? అని ప్రశ్నించారు. తప్పు చేసిన వాళ్లు ఎవ్వరైనా చట్ట ప్రకారం శిక్షార్హులు అవుతారని ప్రత్తిపాటి వ్యాఖ్యానించారు.