ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) కాంగ్రెస్ పార్టీలో చేరడం ఫైనల్ అయిపోయింది. శుక్రవారం పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ కాబోతున్నారు. ఈ భేటీలోనే పీకే పార్టీలో చేరిక, ఆయనకు ఇవ్వబోయే పోస్టు కూడా ఫైనల్ అయిపోతుందని అనుకుంటున్నారు. గడచిన వారం రోజులుగా సోనియాగాంధీతో పీకే నాలుగుసార్లు భేటీ అయిన విషయం తెలిసిందే. వారం రోజుల్లో సోనియాతో ఎవరైనా భేటీ అవ్వటమంటే మామూలు విషయం కాదు.
పార్టీలోనే ఉన్న ఎంతటి సీనియర్ నేతలైనా నెలకు ఒకటి రెండు సార్లు సోనియాతో సమావేశమవ్వటమే చాలా ఎక్కువ. అలాంటిది పీకే వారంలో నాలుగు సార్లు భేటీ అయ్యారంటేనే ఆయనకు ఇస్తున్న ప్రాధాన్యత, అవసరం అన్నీ స్పష్టంగా కనబడుతున్నాయి. ఇదే విషయాన్ని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తారిక్ అన్వర్ మాట్లాడుతూ తొందరలోనే పీకే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. పీకే బేషరతుగా పార్టీలో చేరటానికి పీకే నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
పీకే చాలా తెలివైన రాజకీయ విశ్లేషకుడిగా అన్వర్ అభిప్రాయపడ్డారు. అలాంటి పీకే పార్టీలో చేరితే బాగా ఉపయోగం ఉంటుందని తామంతా అనుకుంటున్నట్లు చెప్పారు. పీకేకి ఇవ్వబోయే హోదా విషయం అడిగినపుడు అన్వర్ ఏమీ సమాధానం చెప్పలేదు. కాకపోతే పార్టీలో చేరగానే పార్టీ జాతీయ కార్యదర్శి హోదాలో పీకేని నియమించవచ్చని పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో పీకే పార్టీలో చేరికను కొందరు సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.
ఇదే విషయంపై తారిక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఏ నిర్ణయమైనా ఒక్కరుగా తీసుకోరని చెప్పారు. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా అంతిమ నిర్ణయం తీసుకునేది మాత్రం అధినేత్రి సోనియాగాంధీ మాత్రమే అని గుర్తుచేశారు. పార్టీలోకి పీకేని చేర్చుకునే విషయమై సోనియా ఇప్పటికే సీనియర్లతో చర్చించిన విషయాన్ని అన్వర్ చెప్పారు. సో అన్వర్ తాజా మాటలతో ఈ నెలలోనే పీకే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పీకే చుట్టు జరుగుతున్న రాజకీయ ప్రచారానికి తెరపడబోతోంది. అధికారికంగా నిర్ణయాన్ని ప్రకటించటం మాత్రమే మిగిలింది.