తాజాగా కొలువుతీరిన మోడీ 3.0 ప్రభుత్వంలోనే కాదు.. ఆయన పరివారంలోనూ మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ముచ్చటగా మూడోసారి దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోడీ గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు ప్రధానిగా కేంద్ర ప్రభుత్వానికి సారధ్యం వహించినప్పటికీ అప్పటికి ఇప్పటికి మాత్రం తేడాచాలానే ఉందని చెప్పాలి.
గతంలో మిత్రపక్షాలకు చెందిన వారు ఎవరైనా సరే గుర్రుగా ఉన్నా మోడీ పరివారం పెద్దగా పట్టించుకునేది కాదు. ఇప్పుడు అలా కాదు. కేంద్రంలో తమ సొంత బలం లేక.. మిత్రులపై ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో మిత్రధర్మాన్ని నూటికి నూరుశాతం పాటించేలా ఆయన వ్యవహరిస్తున్నారు.
తాజాగా చోటు చేసుకున్న పరిణామం ఒకటి దీనికి నిదర్శనంగా చెప్పాలి. మహారాష్ట్రలో బీజేపీకి మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న వారిలో అజిత్ పవార్ నేత్రత్వంలోని ఎన్సీపీ ఒకటి. వీరికి లోక్ సభలో ఒకరు.. రాజ్యసభలో మరో సభ్యుడు ఉన్న సంగతి తెలిసిందే. వీరు ఎన్డీయేకు తమ మద్దతు ప్రకటించటం తెలిసిందే. దీంతో.. ఈ పార్టీకి చెందిన ఎన్సీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రపుల్ పటేల్ కు కేంద్ర మంత్రి వర్గంలో చోటు కల్పించారు.
అయితే.. ఈ ఆఫర్ కు ఆయన నో చెప్పారు. దీనికి కారణం లేకపోలేదు. గతంలో కేంద్ర మంత్రిగా వ్యవహరించిన ఆయన్ను.. ఈసారి సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని కోరారని.. అంటే తన స్థాయిని తానే తగ్గించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అందుకే తాను పదవి నుంచి దూరంగా ఉన్నట్లు పేర్కొన్నారు. తనకు ఎదురైన ఇబ్బందికర పరిస్థితిని బీజేపీ అధినాయకత్వానికి సమాచారం పంపినట్లుగా తెలిపారు.
ఆయన మాటలకు తగ్గట్లే మోడీ వర్గీయులు రంగంలోకి దిగారు. ఆయన్నుకలిసి బుజ్జగించే ప్రయత్నం చేశారు. ప్రపుల్ పటేల్ గుర్రుగా ఉన్నారన్న విషయాన్ని గుర్తించిన వారు.. తాజాగా మారిన సమీకరణాల నేపథ్యంలో మిత్రపక్షాలకు పదవులు ఇవ్వాల్సి వచ్చిందని.. వారి బలం ఆధారంగా అవకాశాలు ఇవ్వటంతో ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుందని పేర్కొన్నారు.
అయితే.. విస్తరణ వేళ మాత్రం ఆయన కోరుకున్నట్లుగా అవకాశం లభిస్తుందని పేర్కొన్న వారు.. కాస్తంత టైం వెయిట్ చేయాలని రిక్వెస్టు చేయటం గమనార్హం. ఇదంతా చూస్తే.. గతానికి భిన్నంగా మోడీ పరివారంలో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని చెప్పక తప్పదు.