ఆన్ లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్స్‌కు ప్రచారం చేసిన ఫిలిం సెలబ్రెటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేయడం సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ముందు చిన్న స్థాయి నటులు, ఇన్ఫ్లుయెన్సర్ల మీదే కేసులు పెట్టారు. తాజాగా ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి తదితరులపై కేసులు నమోదయ్యాయి.
ఈ క్రమంలో ఒక్కొక్కరుగా సెలబ్రెటీలు స్పందిస్తున్నారు. ఆల్రెడీ విజయ్ టీం నుంచి ఈ విషయమై క్లారిటీ వచ్చింది. తాజాగా ప్రకాష్ రాజ్ ఈ వ్యవహారంపై స్పందించాడు. తాను ఒక గ్యాంబ్లింగ్ యాప్‌కు ప్రచారం చేసిన మాట వాస్తవమే అని ప్రకాష్ రాజ్ తెలిపాడు. ఐతే అది 2016లో చేసిన యాడ్ అని ఆయన వెల్లడించారు. ఒక ఆరు నెలల పాటు ఆ ప్రకటన ప్రసారమైందన్నారు. ఇది కరెక్ట్ కాదనిపించి ఏడాది తిరిగేసరికే ఆ సంస్థతో ఒప్పందం నుంచి బయటికి వచ్చినట్లు ప్రకాష్ రాజ్ వెల్లడించారు.
ఎనిమిదేళ్లుగా ఆ సంస్థతో తాను అసోసియేట్ అయి లేనని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు. మధ్యలో వేరే సంస్థ.. ఆ కంపెనీని టేకోవర్ చేసిందని, మళ్లీ ఆ యాడ్‌ను ప్రమోట్ చేసిందని.. ఈ విషయం తెలిసి లీగల్ నోటీసులు పంపిస్తే ఆ యాడ్‌ను తొలగించారని ప్రకాష్ రాజ్ వెల్లడించారు. తాను ప్రస్తుతం ఎలాంటి గ్యాంబ్లింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయట్లేదని.. గతంలో ఒక యాడ్‌లో నటించిన విషయాన్ని దాచి పెట్టట్లేదని ప్రకాష్ రాజ్ చెప్పారు.
యువత వీటి ఉచ్చులో చిక్కుకుని జీవితాలను ఇబ్బందుల్లోకి నెట్టుకోవద్దని ఆయన హితవు పలికారు. తనకు పోలీసుల నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని.. తనకు తానుగా విషయం తెలుసుకుని ఈ విషయంపై స్పందించడం తన బాధ్యతగా భావించి ఇలా వివరణ ఇస్తున్నట్లు ప్రకాష్ రాజ్ తెలిపారు. కేసులు నమోదైన వాళ్లలో మిగతా సెలబ్రెటీలు కూడా ఒక్కొక్కరుగా తమ వివరణ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.