తెలంగాణ కోసం ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధమైనట్లుగా తరచూ చెబుతుంటారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ బక్కోడ్ని ఎదుర్కొనేందుకు ఎన్ని కుట్రలు చేశారంటూ ఆయన అప్పుడప్పుడు ఆవేదన వ్యక్తం చేయటం కనిపిస్తుంది. ఒక ప్రాంత ప్రజల సంక్షేమం కోసం.. ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు.. వారి హక్కుల సాధన కోసం పోరాడిన ఒక ఉద్యమ నాయకుడు విజయం సాధించటమే కాదు.. ఎన్నికల్లో గెలుపొంది రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే చూడాలని చాలామంది ఆశ పడ్డారు.
అనుకున్నట్లే అధికారాన్ని చేపట్టి.. ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన కేసీఆర్.. సాధారణ ప్రజలకు దూరంగా ఉండటమే కాదు.. తన మంత్రివర్గ సభ్యులకు సైతం అందుబాటులో ఉండని పరిస్థితి. ఒక ఉద్యమ నేత ముఖ్యమంత్రి అయితే ఇలాంటి పరిస్థితి ఉంటుందా? అని ఆశ్చర్యపోయే పరిస్థితి. కేసీఆర్ కు ముందు ముఖ్యమంత్రులుగా వ్యవహరించిన వారిని చూస్తే.. ఏ సీఎం కూడా ఇంతలా.. ప్రజలకు దూరంగా ఉండటం లేదంటారు.
దివంగత మహానేత వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు వారంలో ఎక్కువ రోజులు ప్రజాదర్బార్ నిర్వహించేవారు. ఏదైనా సమస్య ఉంటే ముఖ్యమంత్రితో నేరుగా చెప్పుకునే అవకాశం ఉండేది. ఆయనతో పోలిస్తే.. రోశయ్య.. కిరణ్ కుమార్ రెడ్డిల హయాంలో తక్కువగా ఉన్నా.. కేసీఆర్ మాదిరి మాత్రం ఎవరూ వ్యవహరించలేదని చెప్పాలి. ఆ మాటకు వస్తే.. ఏ రోజున ప్రగతిభవన్ లో ఉంటారో.. మరే రోజున ఫాంహౌస్ లో ఉంటారో చెప్పలేని పరిస్థితి.
ఇదిలా ఉండగా.. కేసీఆర్ కు షాకిచ్చే పనిలో భాగంగా తమిళ సైను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా మోడీషాలు ఎంపిక చేసినట్లు చెబుతారు. ఆమె ఎంపిక ప్రకటన వెలువడిన వెంటనే వచ్చిన విశ్లేషణలు.. అంచనాలతో పోలిస్తే.. ఆమె ఆచూతూచి అన్నట్లు వ్యవహరించటమే కాదు.. ప్రభుత్వ తప్పుల్ని ఎత్తి చూపేందుకు వెనుకాడని పరిస్థితి. అదే సమయంలో.. అనవసరమైన దూకుడును ప్రదర్శించకుండా సంయమనం పాటించారని చెప్పాలి. అలాంటి ఆమె.. తాజాగా కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. త్వరలోనే ప్రజాదర్బార్ నిర్వహిస్తామని ప్రకటించారు.
ఎవరికి అందుబాటులో ఉండని సీఎం కేసీఆర్ కు భిన్నంగా.. తాను ప్రజలతో మమేకం అవుతానని.. అందరికి అందుబాటులో ఉంటానని చెబుతున్న గవర్నర్ తమిళ సై మాట ఆసక్తికరంగా మారింది. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో బీజేపీ దూకుడు పెంచుతున్న వేళ.. అందుకు తగ్గట్లే ప్రజాదర్బార్ నిర్వహిస్తానని చెప్పటం కొత్త చర్చకు తెర తీస్తుందని చెప్పక తప్పదు.