అజిత్ భార్య పున‌రాగ‌మ‌నం?

చేసిన‌వి చాలా త‌క్కువ సినిమాలే. కానీ త‌మిళ అమ్మాయి షాలిని వేసిన ముద్ర అలాంటిలాంటిది కాదు. ముఖ్యంగా స‌ఖి చిత్రంతో ఆమె తమిళ‌, తెలుగు ప్రేక్ష‌కులను ఒక ఊపు ఊపేసింది 90వ ద‌శ‌కంలో. త‌మిళంలో కాద‌ల‌క్కు మ‌ర్యాదై, అమ‌ర్క‌లం లాంటి సినిమాల‌తో అక్క‌డి ప్రేక్ష‌కుల‌కు మ‌రింత‌గా చేరువైంది. చాలా సింపుల్‌గా కనిపిస్తూనే మ‌న‌సు దోచే అందం ఆమె సొంతం.

చిన్న త‌నం నుంచే సినిమాల్లో న‌టిస్తున్న అనుభ‌వంతో మంచి న‌టిగానూ పేరు సంపాదించింది. మంచి ఫామ్‌లో ఉండ‌గానే ఆమె సినిమాల‌కు టాటా చెప్పేసి స్టార్ హీరో అజిత్‌ను పెళ్లాడి వ్య‌క్తిగ‌త జీవితంల సెటిలైపోయింది. మ‌ళ్లీ సినిమాల వైపే చూడ‌లేదు. ఎన్ని ఆఫ‌ర్లు వ‌చ్చినా కూడా న‌టించేందుకు ఒప్పుకోలేదు. ఐతే దాదాపు 20 ఏళ్ల విరామం త‌ర్వాత షాలిని మ‌ళ్లీ ముఖానికి రంగేసుకోబోతోంద‌న్న‌ది కోలీవుడ్ వ‌ర్గాల తాజా స‌మాచారం.


స‌ఖి సినిమాతో త‌న‌కు ఎనలేని పేరు ప్ర‌ఖ్యాతులు తెచ్చి పెట్టిన లెజెండ‌రీ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం పిలుపుతోనే షాలిని పున‌రాగ‌మనానికి సిద్ధ‌మైన‌ట్లు స‌మాచారం. ఎన్నో ఏళ్లుగా మ‌ణిర‌త్నం క‌ల‌లు కంటున్న భారీ చిత్రం పొన్నియ‌న్ సెల్వ‌న్ గ‌త ఏడాదే ప‌ట్టాలెక్కిన సంగ‌తి తెలిసిందే. క‌రోనా లేకుంటే ఈ చిత్రం ఈ పాటికి పూర్త‌య్యేదేమో. లాక్ డౌన్ బ్రేక్ తర్వాత ఇటీవ‌లే ఈ సినిమా షూటింగ్ పునఃప్రారంభించాడు మ‌ణిర‌త్నం.

ఈ చిత్రంలో షాలిని ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇన్నేళ్ల విరామం త‌ర్వాత షాలిని ఈ సినిమా చేయ‌డానికి అంగీక‌రించిందంటే ఏదో ప్ర‌త్యేక పాత్రే అయ్యుంటుంద‌ని భావిస్తున్నారు. ఈ చిత్రంలో విక్ర‌మ్, కార్తి, జ‌యం ర‌వి, అర‌వింద్ స్వామి, మోహ‌న్ బాబు, అదితిరావు హైద‌రి, కీర్తి సురేష్ లాంటి భారీ తారాగ‌ణం ఉంది. వీరికి షాలిని కూడా తోడ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి షాలినిని అంత‌గా ఎగ్జైట్ చేసిన పాత్ర ఏమై ఉంటుందో చూడాలి.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.