గత కొద్ది రోజుల నుంచీ ప్రభాస్ లుక్స్ పై రకరకాల విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, రెబెల్, మిర్చి చిత్రాల్లో స్లిమ్ అండ్ హ్యాండ్సమ్ గా కనిపించి భారీగా ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు. ఆ తర్వాత `బాహుబలి` సినిమాలో కండలు తిరిగిన దేహంతో పాత్రకు తగ్గట్లుగా కనిపించి విశేషంగా ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్.. ఆ తర్వాత లుక్, ఫిజిక్ వంటి విషయాల్లో అజాగ్రత్తగా ఉంటున్నాడని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి.
ఇటీవలె విడుదలైన `రాధేశ్యామ్` ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది. ఈ చిత్రంలో ప్రభాస్ లుక్స్ పై అభిమానులు సైతం పెదవి విరిచారు. పైగా ఈ మధ్య కాలంలో ప్రభాస్ కాస్త బరువు పెరిగినట్లుగా కూడా కనిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తాజాగా ప్రభాస్ కు కొత్త ఆర్డర్ వేశాడట. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో `సలార్` అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
కేజీఎఫ్ 2తో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుని సక్సెస్ జ్యోష్ లో ఉన్న ప్రశాంత్ నీల్.. తన తదుపరి ప్రాజెక్ట్ అయిన `సలార్`పై దృష్టి సారించారు. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ కిరాగందుర్ హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి ఇరవై శాతం షూటింగ్ పూర్తి కాగా.. మిగిలిన భాగాన్ని పూర్తి చేసేందుకు ప్రశాంత్ నీల్ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు.
ఇందులో భాగంగానే ప్రభాస్ కు బరువు తగ్గి స్లిమ్ అండ్ ఫిట్ గా మారాలని ప్రశాంత్ నీల్ ఆర్డర్ వేశారట. దాంతో సలార్ పాత్ర రీత్యా ప్రభాస్ బరువు తగ్గడానికి వెంటనే గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడని, ప్రస్తుతం అదే పనిలో ఆయన ఉన్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఈ ప్రచారమే నిజమై ప్రభాస్ సలార్ లో స్లిమ్ గా కనిపిస్తే అభిమానులకు కన్నుల పండగే అవుతుంది.
కాగా, ప్రభాస్ `సలార్`తో పాటు ఓం రౌత్ దర్శకత్వంలో `ఆదిపురుష్`, నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో `ప్రాజెక్ట్ కె`, సందీప్ రెడ్డి వంగాతో `స్పిరిట్` చిత్రాలు చేస్తున్నాడు. వీటిలో ఆదిపురుష్ షూటింగ్ ను ఇటీవలె కంప్లీట్ చేసిన ప్రభాస్.. సలార్, ప్రాజెక్ట్ కె చిత్రాలను త్వరలోనే పూర్తి చేయనున్నాడు. వీటి తర్వాత స్పిరిట్ పట్టాలెక్కనుంది.