సినిమా టికెట్ల రేట్లతోపాటు ఇండస్ట్రీకి చెందిన పలు సమస్యలపై ఏపీ సర్కార్ వర్సెస్ టాలీవుడ్ గా కొంతకాలంగా వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొందరు మంత్రులు…సినీ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. హీరోలు కోట్లరూపాయల రెమ్యున్ రేషన్ తీసుకుంటున్నారని, దాన్ని తగ్గించుకుంటే టికెట్ రేట్లు కూడా తగ్గుతాయని షాకింగ్ కామెంట్లు చేశారు.
వారు పొలిటిషియన్లు కాబట్టి అలా మాట్లాడారని సర్ది చెప్పుకున్న హీరోలకు…తాజాగా ప్రముఖ సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి షాకిచ్చారు. ఏకంగా సీఎం జగన్ సమక్షంలోనే…ప్రభాస్, మహేశ్ వంటి స్టార్ హీరోలు పారితోషికం తగ్గించుకోవాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరుగుతోంది.
సినిమా టికెట్ రేట్ల వివాదానికి పుల్ స్టాప్ పెట్టేందుకు నేడు జగన్ తో సినీ పెద్దలు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి చిరంజీవి, మహేశ్ బాబు, ప్రభాస్, రాజమౌళి తదితరులతోపాటు పోసాని కూడా హాజరయ్యారు. కోట్ల రూపాయల రెమ్యున్ రేషన్ తీసుకుంటున్న హీరోలు…పరిశ్రమకు కష్టం వస్తే బయటకు రాకుండా ఇంట్లో కూర్చుంటున్నారుని పోసాని షాకింగ్ కామెంట్లు చేశారని టాక్ వస్తోంది. తమను అభిమానించే ప్రేక్షకులు, ప్రజల గురించి వారికి పట్టడం లేదని, స్టార్ హీరోలు పారితోషికం తగ్గిస్తే సినిమా ఖర్చు కూడా తగ్గుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరుగుతోంది.
ప్రజల పరిస్థితిని కూడా వారు తెలుసుకోవాలంటూ పోసాని ఆవేశంగా వ్యాఖ్యానించారని, పోసాని ఊపు చూసిన జగన్… ఆగమని సూచించడంతో పోసాని సైలెంట్ అయ్యారని తెలుస్తోంది. ఆ వ్యాఖ్యల తర్వాత కాసేటికే పోసాని వెళ్లిపోయారని తెలుస్తోంది. ఇక, భేటీ అనంతరం చిరంజీవి, రాజమౌళి, మహేశ్, ప్రభాస్ లు మీడియాతో మాట్లాడినపుడు కూడా పోసాని కనిపించకపోవడం ఆ ప్రచారానికి ఊతమిస్తోంది.
దీంతో, పోసానిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అగ్ర హీరోలు, నిర్మాతలు, దర్శకులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో సినీ పరిశ్రమ నుంచి పోసాని ఏ కేటగిరిలో హాజరయ్యారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సమస్యను పరిష్కరించేందుకు వెళ్లిన సమయంలో ఆ సమస్యను మరింత పెద్దది చేసేలా పోసాని మాట్లాడడం ఏమిటని మండిపడుతున్నారు. అగ్రహీరోలపై పోసానికి ఇంత కడుపు మంటుందా? అని అవాక్కవుతున్నారు.