ప్రముఖ సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి నేడు విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ మరియు వారి కుటుంబ సభ్యుల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో పోసాని కృష్ణ మురళిపై రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే అన్నమయ్య జిల్లా సంబేపల్లి పోలీసులు ఫిబ్రవరి 26న పోసానిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పీటీ వారెంట్లపై పలు పీఎస్‌లు, కోర్టులు, జైళ్లు తిరగాల్సి వచ్చింది.
తనపై నమోదైన కేసుల్లో వరుసగా బెయిల్స్ తెచ్చుకున్న పోసాని మార్చి రెండో వారంలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ గుంటూరు సీఐడీ పోలీసులు ఆయనకు షాక్ ఇచ్చారు. చంద్రబాబు, పవన్, లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసానిపై ఏపీ సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసి పీటీ వారెంట్ వేయడంతో ఆయన రిలీజ్ కు బ్రేక్ పడింది. ప్రస్తుతం పోసాని గుంటూరు జిల్లా జైల్లో జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు. మార్చి 23 వరకు రిమాండ్ విధించారు. మరోవైపు బెయిల్ కోసం పోసాని జిల్లా కోర్టును ఆశ్రయించారు.
మూడు రోజుల క్రితమే ఆయన బెయిల్ పిటిషన్ పై వాదనలు జరిగాయి. శుక్రవారం జిల్లా సీఐడీ కోర్టు పోసానికి కండీషన్స్ తో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ భారీ ఊరట కల్పించింది. దీంతో నేడు పోసాని విడుదల కావొచ్చని అంటున్నారు. కాగా, కోర్టు పోసానికి విధించిన కండీషన్స్ విషయానికి వస్తే.. రూ. 2 లక్షల విలువతో ఇద్దరు వ్యక్తులు పూచీకత్తు ఇవ్వాలి. కేసు గురించి ఎక్కడా ఓపెన్ గా మాట్లాడకూడదు. మీడియాతో మాట్లాడకూడదు. పత్రికలకు ప్రకటనలు ఇవ్వరాదు. జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత దేశం విడిచి వెళ్లరాదు. 4 వారాల పాటు ప్రతి మంగళ, గురువారాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల్లోపు మంగళగిరిలోని సీఐడీ కార్యాలయానికి వచ్చి సైన్ చేయాలి. మరియు కేసు దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.