ఏపీ సీఎం జగన్‌కు జనాల నుంచి భారీ షాక్ తగిలింది. ఆయన గుడివాడలో నిర్వహించిన ఇడ్కో ఇళ్ల పంపిణీ సభకు వచ్చిన జనాలు సభలో సీఎం జగన్ ప్రసంగం ప్రారంభించగానే పరారే.. పరారే.. అంటూ వెళ్లిపోయారు. దీంతో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి జగన్ ప్రసంగం కొనసాగించారు. దీంతో ఇదేంది జగనా.. ఇలా జరిగింది? అంటూ.. నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టి.. చరిత్ర మార్చేలా చేశామని ముఖ్యమంత్రి జగన్ గుడివాడ సభలో చెప్పారు.
గుడివాడలోని మల్లయ్యపాలెం లేఅవుట్లో నిర్మించిన 8,912 టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు అందజేయడం దేవుడిచ్చిన వరమన్న జగన్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై విమర్శలు గుప్పించారు. అప్పటి వరకు ఓపికగా విన్న జనాలు.. సీఎం ప్రసంగం మొదలవకముందే ప్రజలు ఒక్కొక్కరుగా బయటికి వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి జగన్ బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. ”రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టి.. వాటికి అక్కాచెల్లెళ్లను హక్కుదారులుగా చేసి.. చరిత్ర మార్చేలా చేశాం. కట్టేది ఇళ్లు కాదు..ఊళ్లు. 300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లు రూపాయికే ఇస్తామని పాదయాత్రలో ఆనాడూ హామీ ఇచ్చాం. ఈరోజు చేసి చూపించాం. మల్లాయపాలెంలో ఈరోజు కొత్త గుడివాడ నగరం కనిపిస్తుంది.” అని వ్యాఖ్యానించారు.
గుడివాడ బహిరంగ సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై జగన్ విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు ఓటు అడిగే హక్కు లేదన్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. 99 శాతం మేనిఫెస్టో అమలు చేశామని చెప్పారు. ఈ నాలుగేళ్లలో 99 శాతం మేనిఫెస్టో అమలు చేశామన్న జగన్.. చంద్రబాబు మాత్రం ఏ వర్గానికీ మేలు చేయలేదని విమర్శించారు.
రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబుకు, ఆయన దత్తపుత్రుడికి ప్రజలు గుర్తుకొచ్చారని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. అబద్ధాలతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శలు గుప్పించారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు.. కుప్పంలో ఇల్లు కట్టుకోవడానికి ఇప్పుడు తనను అనుమతి అడుగుతున్నారని ఎద్దేవా చేశారు.