సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటూ.. తన అందాల ఆరబోతతో కవ్వించి.. ఉక్కిరిబిక్కిరి చేసిన బాలీవుడ్ సెక్స్ బాంబ్ పూనమ్ పాండే గుర్తుందా? ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ వీడియోలతో.. ఫోటో షూట్ లతో యూత్ ను ఉక్కిరిబిక్కిరి చేసిన ఈ నటి.. గత ఏడాది సెప్టెంబరులో తాను ప్రేమించిన వ్యక్తి అంటూ సామ్ బాంబేను పెళ్లి చేసుకున్నట్లుగా ప్రకటించిన అందరికి షాకిచ్చింది. ఆమె పెళ్లి వార్త అప్పట్లో సంచలనంగా మారింది.
దీనికి మించి.. పెళ్లి తర్వాత వెళ్లిన గోవా ట్రిప్ లో తన భర్త తనను శారీరకంగా వేధిస్తున్నాడని.. చేయి చేసుకున్నాడంటూ అక్కడి పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ తో మరోసారి వార్తల్లోకి ఎక్కింది.
పెళ్లి జరిగిన పట్టుమని పది రోజులు కాకుండానే భార్యభర్తల మధ్య రచ్చ పోలీస్ స్టేషన్ కు చేరుకోవటంతో అందరూ షాక్ తినే పరిస్థితి. అనంతరం వీరిద్దరికి కౌన్సెలింగ్ జరిపి.. ముంబయికి పంపేశారు. కట్ చేస్తే.. ఆ తర్వాత ఆమె పెద్దగా వార్తల్లో కనిపించలేదు.
తాజాగా మరోసారి షాకింగ్ ఉదంతంతో ఆమె వార్తల్లోకి వచ్చారు. తనను తన భర్త మానసికంగానే కాదు.. శారీరకంగానూ హింసిస్తున్నాడన్న ఆరోపణతో ఆమె తెర మీదకు వచ్చారు. భర్తతో జరిగిన గొడవలో గాయాల పాలైన ఆమె ఆసుపత్రిలో చేరారు. సోమవారం రాత్రి ఆమె తన భర్త మీద తీవ్ర ఆరోపణలతో ముంబయి పోలీసుల్ని ఆశ్రయించారు.
ఆమె తలపైనా.. ముఖంపైనా గాయాలు ఉండటంతో ఆమె నుంచి కంప్లైంట్ తీసుకున్న పోలీసులు పూనమ్ ను ఆసుపత్రికి తరలించారు. ఆమె భర్తను అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. కొన్నేళ్ల పాటు డేటింగ్ లో ఉన్న తర్వాత పెళ్లాడిన ఏడాదికే ఇలాంటి పరిస్థితి ఏర్పడటం ఇప్పుడు సంచలనంగా మారింది.
మొత్తానికి పూనమ్ వైవాహిక జీవితం ఆమెకు మర్చిపోలేని భయంకరమైన అనుభవాన్ని మిగిల్చిందనే చెప్పాలి.