టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ ల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘‘ ఉస్తాద్ భగత్ సింగ్ ’’ చిత్రంపై పవన్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంపై టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో కూడా హోప్స్ ఉన్నాయి. గబ్బర్ సింగ్ చిత్రంతో పవన్ కళ్యాణ్ హిట్ బాట పట్టి ఆ తర్వాత వరుస చిత్రాలు చేసుకుంటూ వెళ్తున్నారు.
దీంతో, ఈసారి కూడా పవన్ కు హరీష్ కచ్చితంగా హిట్ ఇస్తారని పవన్ అభిమానులు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. గబ్బర్ సింగ్ తరహాలోనే ఈ సినిమాలోనూ పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించారు. ఈసారి పర్ఫామెన్స్ బద్దలైపోతుంది అంటూ పవన్ ఈ గ్లింప్స్ కు ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. మైత్రి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక, యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న యంగ్ బ్యూటీ శ్రీలీల పవన్ సరసన నటించబోతోంది.
అయితే, ఈ చిత్ర ఫస్ట్ గ్లింప్స్ పోస్టర్ పై నటి పూనం కౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పోస్టర్లో పవన్ కళ్యాణ్ పాదాల కింద భగత్ సింగ్ పేరును ఉంచడంపై పూనం కౌర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్వాతంత్ర సమరయోధులను గౌరవించక పోయినా పర్వాలేదు. అవమానించకండి అంటూ పవన్ పై పూనం పరోక్షంగా సెటైర్లు వేశారు. భగత్ సింగ్ పోస్టర్ ను ట్వీట్ చేస్తూ పరోక్షంగా పూనం చురకలంటించారు. కొంతకాలంగా పవన్ కళ్యాణ్ పై పూనమ్ పరోక్షంగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. కానీ, ఆ విమర్శలకు పవన్ ఏనాడూ స్పందించకపోవడం విశేషం.