మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆలోచన మారిందా. బీజేపీలో చేరిక వ్యవహారం లో ఏం జరుగుతోంది. గులాబీ పార్టీ నుంచి పొంగులేటి బయటకు వెళ్లటం ఖరారైంది. కానీ, తాజాగా అనూహ్య పరిణామాలు తెర మీదకు వస్తున్నాయి. ఖమ్మంలో కొద్ది రోజులుగా పొంగులేటి – తుమ్మల వ్యవహారం పైన పెద్ద ఎత్తున చర్చ సాగింది. తమ్మల తిరిగి గులాబీ పార్టీలోనే కొనసాగటం నిర్దారణ అయింది.
పొంగులేటి ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా 10 అసెంబ్లీ నియోజకవర్గంలో తన అనుచర వర్గంతో భేటీలు నిర్వహిస్తున్నారు. తమ లక్ష్యాలను వివరిస్తున్నారు. దీంతో..ఇప్పుడు పొంగులేటి తాజా రాజకీయ అడుగుల పైన కొత్త చర్చ మొదలైంది. పొంగులేటి ఏం చేయబోతున్నారు..ఏ పార్టీ నుంచి తన అనుచరులను పోటీకి సిద్దం చేస్తున్నారు…
10 నియోజకవర్గాలు టార్గెట్ గా కొత్త వ్యూహం..
పొంగులేటి శ్రీనివాస రెడ్డి కొత్త లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. తాజాగా ఆయన అశ్వారావు పేటలో తన అనుచర వర్గంతో సుదీర్ఘ మంతనాలు చేసారు. నాలుగేళ్ల కాలంలో గులాబీ పార్టీలో తనను నిర్లక్ష్యం చేస్తున్న తీరు పైన పార్టీ నేతలతో ఆవేదన వ్యక్తం చేసారు. పార్టీ మారటం ఖాయమని చెప్పుకొచ్చారు. అయితే, ఏ పార్టీలో చేరే అంశం పైన మాత్రం అనుచరుల నుంచే అభిప్రాయ సేకరణ చేసారు.
బీజేపీలో చేరితేనే ప్రయోజనం ఉంటుందని అనుచరులు సూచించారు. కాంగ్రెస్ లో చేరితే కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉందని, బీజేపీ లో చేరటం ద్వారా రాజకీయంగా మేలు జరుగుతుందని చెప్పుకొచ్చారు.ఎక్కడా పొంగులేటి తాను బీజేపీలో చేరుతున్న విషయాన్ని అనుచరుల వద్ద బయట పడలేదు.
అదే సమయంలో జిల్లాలోని 10 నియోజకవర్గాల్లోనూ తామే గెలవాలంటూ పొంగులేటి కొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. తాను చేరే కొత్త పార్టీ నేతలకు అదే అభయం ఇస్తూ.. తన అనుచర వర్గంతో సహా పార్టీ మారేందుకు సిద్దం అవుతున్నారు.
బండి సంజయ్ వ్యాఖ్యలు ఇలా…
పొంగులేటి ఈ నెల 18న అమిత్ షా తో భేటీ అవుతారని ప్రచారం సాగింది. ఖమ్మం వేదికగానే భారీ సభ ఏర్పాటు చేసి అక్కడ బీజేపీ కండువా కప్పుకుంటారని వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేసారు. పొంగులేటి బీజేపీలో చేరటం పైన తనకు సమాచారం లేదన్నారు.
ఎవరైనా పార్టీలో తమ సిద్దాంతాలు నచ్చి.. పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని చెప్పుకొచ్చారు. ఖమ్మం జిల్లాలో వచ్చే ఎన్నికల్లో తన సత్తా ఏంటో చాటాలని పొంగులేటి భావిస్తున్నారు. అందులో భాగంగా ఖమ్మం లోక్ సభతో పాటుగా పది అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ తన అనుచరులకు తాను చేరే కొత్త పార్టీ నుంచి టికెట్ల పైన హామీ పొందాలని ప్రయత్నిస్తున్నారు. జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలను గెలవటమే తమ లక్ష్యం కావాలని అనుచరులకు గట్టిగా చెబుతున్నారు. మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్ధులను ఖరారు చేసుకొని కొత్త పార్టీలో చేరటంతో పాటుగా నేరుగా ప్రజల్లోకి వెళ్లాలనేది పొంగులేటి వ్యూహంగా తెలుస్తోంది.
బీజేపీలోనే చేరుతారా..ట్విస్ట్ ఇస్తారా…?
పొంగులేటి బీజేపీలో చేరటం ఖాయమని ఇప్పటికీ ఆయన అనుచరులు చెబుతున్నారు. కానీ, తాను సూచించిన వారికి జిల్లాలో సీట్లు ఇస్తే తాను వారిని గెలిపించే బాధ్యత తీసుకుంటామని పొంగులేటి హామీ ఇస్తున్నారు. జిల్లాలో తనకు వ్యతిరేకంగా వ్యవహరించిన గులాబీ పార్టీ నేతలే లక్ష్యంగా పొంగులేటి వచ్చే ఎన్నికలకు సిద్దం అవుతున్నట్లు కనిపిస్తోంది.
అయితే,పొంగులేటి కోరుకుంటున్న విధంగా ఆయన అనుచర వర్గానికి కొత్త పార్టీలో సీట్లు దక్కుతాయా అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.ఏ పార్టీలో చేరేదీ అధికారికంగా పొంగులేటి వెల్లడించకపోయినా..బీజేపీలోనే చేరే అవకాశం ఉందని ఇప్పటికీ అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.దీంతో..ఇప్పుడు పొంగులేటి ప్రచారం జరుగుతున్నట్లుగా బీజేపీలో చేరుతారా..లేక చివరి నిమిషంలో కొత్త ట్విస్ట్ ఇస్తారా అనేది జిల్లా రాజకీయాల్లో ఆసక్తిగా మారుతోంది