టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈరోజు చంద్రబాబు బెయిల్, రిమాండ్ కు సంబంధించిన పలు పిటిషన్లు ఏపీ హైకోర్టులో విచారణకు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు చంద్రబాబుకు బెయిల్ రావాలని, ఆయన విడుదల కావాలని ప్రత్యేక ప్రార్థనలు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో టిడిపి నేతలు తమ సమీపంలోని ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయితే వారు గుడికి వెళ్లడానికి అనుమతి లేదంటూ పోలీసులు ఎక్కడికి అక్కడ టీడీపీ నేతలను అడ్డుకుంటున్నారు. కొందరిని అరెస్టు చేయగా..మరికొందరిని హౌస్ అరెస్టు చేస్తున్నారు. విజయవాడలో దుర్గ గుడికి వెళ్లేందుకు బయలుదేరిన టీడీపీ నేత బోండా ఉమా, బుద్ధా వెంకన్న, మాజీ మంత్రి దేవినేని ఉమలను పోలీసులు అడ్డుకున్నారు. గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనందబాబును, పొన్నూరులో మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను కూడా పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా పోలీసులు తీరుపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
తమకు గుడికి వెళ్లేందుకు కూడా హక్కు లేదా అంటూ పోలీసులను నిలదీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా లేక పాకిస్తాన్ లో ఉన్నామో అర్థం కావడం లేదంటూ టిడిపి నేతలు జగన్ పై మండిపడుతున్నారు. ఇక, తనను అడ్డుకోవడంతో బుద్ధా వెంకన్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుకు నిరసనగా దుర్గగుడిలో అమ్మవారికి కొట్టవలసిన టెంకాయలను పోలీసులు ముందే కొట్టి నిరసన వ్యక్తం చేశారు. గుడికి వెళ్లకుండా పోలీసులు వాహనాలను అడ్డుపెట్టి మరి తన అడ్డుకోవడంతో బుద్ధా వెంకన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.