ఏపీ సీఎం జగన్ కు విపక్ష నేతలు చేసే నిరసనలన్నా, ఆందోళనలన్నా, పరామర్శలన్నా భయం అని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటాయి. ఆ మాట నిజమే అని ఇప్పటికే చాలాసార్లు నిరూపితమైంది కూడా. ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు మొదలు టీడీపీ కీలక నేత నారా లోకేష్ వరకు ఎవరు నిరసన తెలుపుతామన్నా, బాధితులను పరామర్శించేందుకు వెళతామన్నా జగన్ కు ఎక్కడ లేని భయం అని తాజాగా మరోసారి ప్రూవ్ అయింది.
నారా లోకేష్ పర్యటనను మరోసారి పోలీసులు అనుమతుల పేరుతో అడ్డుకున్నారు. నర్సరావుపేటలో ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురై అనూష కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను విజయవాడ సమీపంలోని గన్నవరం ఎయిర్పోర్టు దగ్గరే పోలీసులు నిలిపి వేశారు. పరామర్శలకు పోలీసుల అనుమతి అక్కరలేదంటూ లోకేష్, టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు.
పోలీసు వలయాన్ని ఛేదించుకొని లోకేష్ ముందుకు వెళ్లే ప్రయత్నం చేయడంతో ఎయిర్ పోర్టులో హై టెన్షన్ ఏర్పడింది. పోలీసులకు, టీడీపీ నేతలకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. చివరకు పోలీసులు అక్కడి నుంచి బలవంతంగా లోకేష్ ను ఉండవల్లి తీసుకెళ్లి ఇంటి వద్ద దింపారు. అంతకుముందు, అనుమతి లేకుండా జాతీయ రహదారిపై ర్యాలీగా వచ్చారని, శాంతిభద్రతలకు భంగం కలిగించారని 41ఏ సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారు.
ఈ సందర్భంగా పోలీసుల తీరుపై లోకేష్ మండిపడ్డారు. ఏపీలో అరాచక పాలన సాగుతోందని, దిశ చట్టం పేరుకే ఉందని, అత్యాచార బాధితులు ఎంతమందికి న్యాయం చేశారని లోకేష్ నిలదీశారు. బాధితులకు అండగా ఉన్న తమను అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. తనను నర్సరావుపేటకు వెళ్లకుండా అడ్డుకునేందుకు 3 వేల మంది పోలీసులను జగన్ మోహరించారని మండిపడ్డారు. సొంత చెల్లికే న్యాయం చేయలేని జగన్, ప్రజలకేం న్యాయం చేస్తారని లోకేష్ ప్రశ్నించారు.
ఫిర్యాదు చేసేందుకు వెళ్లే మహిళలపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని, బాధిత కుటుంబాలకు న్యాయం చేయలేదని మండిపడ్డారు. అక్రమ కేసులతో టీడీపీ నేతలను పోలీసులు హింసిస్తున్నారని, పోలీసులతో తమ పోరాటాన్ని ఆపలేరని హెచ్చరించారు. మొత్తం 517 బాధిత కుటుంబాలను కలిసి తీరుతానని, తనను ఎవరూ ఆపలేరని లోకేష్ సవాల్ చేశారు.