ఏపీకి ఒకటే రాజధాని ఉండాలంటూ ‘న్యాయస్థానం టు దేవస్థానం’ పేరిట అమరావతి రైతులు, మహిళలు చేపట్టిన మహా పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రకు విశేష స్పందన వస్తున్న నేపథ్యంలో దానిని భగ్నం చేసేందుకు జగన్ సర్కార్ కుట్ర పన్నుతోందని విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పాదయాత్రను అడ్డుకునేందుకు రైతులపై పోలీసులు లాఠీచార్జి చేసిన ఘటన కలకలం రేపింది.
ప్రకాశం జిల్లాలోని నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద మహాపాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. రైతులు వేరే ప్రాంతాల్లో ప్రవేశించకుండా చెక్ పోస్టులను పెట్టి, ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న స్థానికులను పోలీసులు అడ్డుకున్నారు. యాత్రకు అనుమతి లేదంటూ నిలువరించడంతో…రైతులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో సంతనూతలపాడుకు చెందిన నాగార్జున అనే రైతు చెయ్యి విరిగింది. ఈ ఘర్షణ నేపథ్యంలో రైతులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు.
రైతులకు సంఘీభావం ప్రకటించేందుకు వస్తే అడ్డుకోవడంపై పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగారు. పోలీసులను నెట్టుకుంటూ ముందుకు వెళ్లి మరీ రైతులకు స్థానికులు సంఘీభావం తెలిపారు. చదలవాడ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పోలీసుల లాఠీఛార్జ్‌లో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నందున ఇతరులు పాదయాత్రలో పాల్గొన కూడదని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అనుమతించిన 157 మంది రైతులు మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలని చెబుతున్నారు.
ఈ క్రమంలోనే జేఏసీ నేతలకు పోలీసుల నోటీసులిచ్చారు. దీంతో, ఆ నోటీసులపై జేఏసీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీలకతీతంగా సాగుతున్న యాత్రకు తమకు నోటీసులు ఎలా ఇస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. పార్టీలకు సంబంధించిన వారికి నోటీసులు ఇవ్వకుండా తమకు నోటీసు ఇవ్వడమేంటని జేఏసీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.