గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ నవ్యాంధ్ర తొలి సీఎంగాను వ్యవహరించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు పనిరాక్షసుడు అనే పేరు ఉండేది. నేను నిద్రపోను.. మిమ్మల్ని నిద్ర పోనివ్వను.. అంటూ ఆయన అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించారు. దీంతో ఉద్యోగ వర్గాల్లో చంద్ర బాబుపై ఒకవిధమైన వ్యతిరేకత పెరిగి.. ఏకంగా పార్టీ అధికారం నుంచి కిందకి దిగేందుకు దారి తీసింది.
ఇక, ఇప్పుడు వైసీపీ సర్కారు రావడంతో అధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు ఊపిరి పీల్చుకుంటున్నారని వైసీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ, వాస్తవంలో మాత్రం ఆదిలో ఒకింత ఫర్వాలేదు.. అనుకున్నా.. రాను రాను.. చంద్రబాబును మించిపోయేలా జగన్ పేరు తెచ్చుకుంటున్నారన్న చర్చలు సొంత పార్టీ నేతల్లోనే వినిపిస్తున్నాయి.
ఇప్పుడు హోం డిపార్ట్ మెంట్ నుంచి అన్ని శాఖల అధికారులు సిబ్బంది.. ఒత్తిడికి గురవుతున్నారనేది వాస్తవం. ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో పోలీసులకు వీక్లీఆఫ్ ప్రకటించిన జగన్ పోలీసుల దగ్గర మంచి మార్కులు కొట్టేశారు. అయితే.. తర్వాత తీసుకున్న కొన్నినిర్ణయాలు.. ప్రతిపక్ష నేతల అరెస్టులతో పోలీసులపై హైకోర్టు సీరియస్ కావడం.. డీజీపీ గౌతం సవాంగ్ మూడు సార్లు కోర్టు మెట్లు ఎక్కడం వంటి పరిణామాలతో ఇప్పుడు పోలీసులు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చినా.. చేసేందుకు హడలి పోతున్నారట.
గతంలో చంద్రబాబు హయాంలో ఏనాడూ ఇంత ఒత్తిడి ఎదుర్కొనలేదని వారు గుసగుసలాడుతున్నారు. ఈ పరిణామాలతో కొందరు ఉన్నతస్థాయి అధికారులు పదుల సంఖ్యలో సెలవుల కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తాజాగా వెలుగు చూసింది.
ఇక, అత్యంత పని ఒత్తిడి ఎదుర్కొంటున్న శాఖ రెవెన్యూ. నెలలో ఏదో ఒక కొత్త పథకంతో ముందుకు వస్తున్న జగన్.. వీటిని అమలు చేసే బాధ్యతను రెవెన్యూ అధికారులపైనే పెడుతున్నారు. ఈ క్రమంలో వీరికిచేదోడుగా ఉంటుందని సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారు.
దీంతో తమపై ఒత్తిడి తగ్గుతుందని రెవెన్యూ అధికారులు భావించినా.. రాను రాను పనిపెరిగిపోయి.. చంద్రబాబును మించిపోయారు సార్! అనే వ్యాఖ్యలు వినిపించే పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఇతర విభాగాల అధికారులకు కూడా రెస్ట్ లేకుండా పోయిందనే వాదన వినిపిస్తోంది.
ఇక, ఉద్యోగ సంఘాలు ఎదురు చూస్తున్న సీపీఎస్, పీఆర్సీ, ఈల్స్ వంటి విషయాలను జగన్ పట్టించుకోకపోవడం కూడా వారి ఆగ్రహానికి కారణమవుతోంది. అయితే.. ఎవరూ మాత్రం బయటకు చెప్పడం లేదు. సంఘాల నేతలు కూడా మౌనంగా ఉంటున్నారు. ఈ పరిస్థితిని గమనిస్తున్న పరిశీలకులు.. ఇదే విధానం ఎన్నికల వరకు కొనసాగితే.. మంచిదికాదని సూచిస్తున్నారు. గతంలో బాబుకు ఎదురైన అనుభవం జగన్కు ఎదురైనా ఆశ్చర్యం లేదని అంటున్నారు. మరి జగన్ మారతారా? ఉద్యోగులపై ఒత్తిడి తగ్గిస్తారా? అనేది వేచి చూడాలి.