రేణిగుంట విమానాశ్రయంలో హైడ్రామా కొనసాగుతోంది. చిత్తూరు పర్యటనకు వచ్చిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబును అనుమతులు లేవంటూ పోలీసులు విమానాశ్రయంలోనే అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డారు. పోలీసులు తీరుకు నిరసనగా గత 7 గంటలుగా ఎయిర్ పోర్ట్ లాంజ్ లో బైఠాయించిన చంద్రబాబుకు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు మద్దతు తెలుపుతున్నారు. చంద్రబాబుకు మద్దతుగా వందలాది మంది టీడీపీ నేతలు,కార్యకర్తలు రేణిగుంట విమానాశ్రయం వద్దకు చేరుకుంటున్నారు.
కానీ, పోలీసులు మాత్రం అనుమతి లేదంటూ చాలామంది టీడీపీ నేతలు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. రేణిగుంట విమానాశ్రయం దగ్గర వందలాదిమంది పోలీసులు మోహరించారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబును బలవంతంగా హైదరాబాద్ పంపించేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ట్రూజెట్, ఇండిగో, స్పైస్ జెట్ విమానాల్లో చంద్రబాబుకు పోలీసులు టికెట్లు బుక్ చేశారు. అయితే స్పైస్ జెట్ విమానం మధ్యాహ్నం 3.10కి వెళ్లిపోయింది.
పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డ చంద్రబాబు వెనక్కి వెళ్లేది లేదని తేల్చి చెప్పారు.
గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు అనుమతించాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన టీడీపీ కార్యకర్తలను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుపతి ఎస్పీ, చిత్తూరు ఎస్పీ, కలెక్టర్ లను కలిసేందుకు అనుమతించే వరకు ఎయిర్ పోర్టు నుంచి కదలబోనని చంద్రబాబు భీష్మ ప్రతిన బూనారు. గత 7 గంటలుగా ఎయిర్ పోర్టు లాంజ్ లో నేలపై కూర్చుని, మంచి నీళ్లు కూడా తాగకుండా చంద్రబాబు నిరసన తెలుపుతున్నారు. పోలీసులు ఆహారం తీసుకోవాలని కోరినా….చంద్రబాబు నిరాకరించారు. దీంతో, చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని వ్యక్తిగత వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. దీంతో, రేణిగుంట విమానాశ్రయం వద్ద ఏం జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.