విజయవాడలోని రాణిగారితోట ప్రాంతంలో వైసీపీ నేత దేవినేని అవినాశ్ ను రమీజా అనే మహిళ ప్రశ్నించిన వైనం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అవినాశ్ తో దురుసుగా ప్రవర్తించిందన్న ఆరోపణలతో ఆ మహిళలపై వైసీపీ నేతలు దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఆమె ఇంటిపై వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడి ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేయడం దుమారం రేపింది. ఆ తరువాత ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బాధితులను ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 వరకు పీఎస్ లోనే కూర్చోబెట్టారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
దేవినేని అవినాశ్ తో సెటిల్ చేసుకోవాలని పోలీసులు చెప్పారని, ఆయనతో ఏం సెటిల్ చేసుకోవాలని బాధితులు ప్రశ్నించారు. సెటిల్ చేసుకోవడానికి తామేమైనా బ్లేడ్ బ్యాచా? అని నిలదీస్తున్నారు. తమ ఇంటిపై దాడి చేశారని, తన తల్లిని కొట్టారని, బూటు కాళ్లతో తన్నారని, కళ్లలో కారం కొట్టారని బాధితురాలి పిల్లలు మండిపడ్డారు.అయితే, జగన్ కు వస్తున్న ప్రజాదరణను చూసి టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని అవినాశ్ అన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మహిళలపై పథకం ప్రకారం దాడులకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు.
అన్ని వర్గాల అభివృద్ధికి జగన్ నిరంతరం కృషి చేస్తున్నారని, ఎంతో చేస్తున్నప్పటికీ జగన్ పై, వైసీపీ ప్రభుత్వంపై ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోందని ఆరోపించారు. నిజాలు బయటపడకుండా ఎల్లో మీడియా అడ్డుపడుతోందని అవినాశ్ అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ నేతలతో జగన్ సమావేశమై, అవినాశ్ ను గెలిపించాలని చెప్పారని, అప్పటి నుంచి వారి కుట్రలు ప్రారంభమయ్యాయని అవినాశ్ ఆరోపిస్తున్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇలాంటి కుట్రలకు పాల్పడుతూనే ఉంటారని, ఎవరెన్ని కుట్రలు చేసినా తూర్పు నియోజవర్గంలో తాను గెలవడం, వైసీపీ జెండా ఎగరడం ఖాయమని అవినాశ్ ధీమా వ్యక్తం చేశారు.