జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక గాలులు వీస్తున్నాయి. కానీ ఆయన దానిని నమ్మడం లేదు. ఉండవల్లి మాటల్లో చెప్పాలంటే… నేను స్కీముల ద్వారా ఓట్లు కొంటున్నాను అని ధైర్యంగా భరోసాగా ఉన్నట్లు ఆయన వ్యవహార శైలిలో కనిపిస్తుంది.
అయితే, తాజా మంత్రివర్గ కూర్పు అనంతరం వైసీపీ పార్టీలో వస్తున్న గొడవలు, లుకలుకలు చంద్రబాబును, టీడీపీ క్యాడర్ ను సంతోషపెడుతున్నాయి. వాళ్లలో వాళ్లు కొట్టుకు చస్తారన్నది టీడీపీ సంబరం.
స్యయంగా చంద్రబాబు దీనిపై మాట్లాడటం గమనార్హం. పార్టీని జగన్ అదుపు చేయలేకపోతున్నాడు. అధికార పార్టీ నేతలు ఇప్పుడు కుమ్ములాటలతో బిజీగా ఉన్నారని చంద్రబాబు నాయుడు అన్నారు. ఈసారి కేబినెట్ బెర్త్ నిరాకరించిన కొందరు నేతలు పార్టీలో తిరుగుబాటు చేస్తారని చంద్రబాబు జోస్యం చెప్పారు.
గత మూడేళ్ల పాలనలో జగన్మోహన్రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని చంద్రబాబు ఆరోపించారు. అయినా… వారు తిరుగుబాటు చేస్తే ఏంటి? చేయకపోతే ఏంటి?.. ప్రభుత్వంలో జరిగేవాటి గురించి ప్రజలు పట్టించుకుంటారు గాని పార్టీలో జరిగే వాటి గురించి పట్టించుకోరు. కానీ చంద్రబాబు ఎందుకో తనకు సంబంధం లేని విషయాలు పట్టించుకుని సమయం వృథా చేసుకుంటున్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మరో మాట అన్నారు. గత ఎన్నికల్లో తనకు అవకాశం ఇచ్చిన ప్రజలు ఇప్పుడు జగన్కు ఓటు వేసి తమ తప్పును తెలుసుకుంటున్నారని అన్నారు. ధరలను నియంత్రించడంలో, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు పరిశ్రమలు తీసుకురావడంలో, సొంత వనరులను సృష్టించుకోవడంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారన్నారు.
గత మూడేళ్లలో రాష్ట్రంలోని ప్రతి రంగాన్ని జగన్ పూర్తిగా నాశనం చేశారని టీడీపీ అధినేత ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను ధ్వంసం చేస్తున్న జగన్ అని, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను హైకోర్టులో నిలదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు సిద్ధంగా ఉండాలని టీడీపీ అధినేత తమ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. మళ్లీ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు.